ప్రతిపక్షం టీడీపీపై కక్షతో ఏపీ ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో ఒకటైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఉత్తి డొల్ల అని తేలిపోయింది. తాజాగా ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ పాత్రపై సీఐడీ ఛార్జిషీట్ ను సమర్పిస్తే.. దాన్ని ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ఏ ప్రకారం దానికి గవర్నర్ అనుమతి లేదని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది. గురువారం ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేస్తే.. శుక్రవారం దాన్ని కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, రాజశేఖర్, నారా లోకేశ్ ను ఏపీ సీఐడీ నిందితులుగా పేర్కొంది. అయితే, సీఐడీ ఛార్జిషీట్ ను తిరస్కరించడంతో సీఐడీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జి షీట్ లో A – 1 గా చంద్రబాబు నాయుడు, A – 2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను చేర్చింంది. నారా లోకేష్, లింగమనేని రమేష్ పేర్లను కూడా జోడించింది. అయితే, సింగపూర్ తో గతంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందాలు చేసుకుందని సీఐడీ ఆరోపించింది. అయితే, గవర్నమెంట్ టూ గవర్నమెంట్ ఒప్పందం జరగలేదని సీఐడీ వివరించింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని ఛార్జిషీటులో ఆరోపించింది. నిందితులకు మేలు జరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ రూపొందించారని సీఐడీ ఛార్జి షీటులో పేర్కొంది.
అయితే అసలు లేని రోడ్డు కోసం తాము ఒక్క ఎకరం కూడా సేకరించని.. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో అవినీతికి తావు ఏంటని ఇప్పటికే టీడీపీ వాదిస్తోంది. తప్పుడు కేసులు పెట్టి.. తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ లబ్ధి పొందాలని చూస్తోందని టీడీపీ వాదిస్తూ వస్తోంది. మొత్తానికి ఇప్పుడు సీఐడీ ఛార్జిషీటును ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో జగన్ సర్కార్ కు షాక్ తగిలింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలో అని సీఐడీ సందిగ్ధంలో పడింది.
ఈ కేసు విషయంలో ప్రభుత్వం తరపున అన్ని దగ్గరుండి చూసుకుంటున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ దారుణంగా ఫెయిల్ అయ్యారని అంటున్నారు. న్యాయవాది అయిఉండి అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థానంలో ఉన్న వ్యక్తికి.. ఆ చార్జిషీటు వేసే ముందు సెక్షన్ 19ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలని కూడా తెలియదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ చార్జిషీటు విషయంలో గవర్నర్ అనుమతి పొందడం సాధ్యం కానందునే నేరుగా దాఖలు చేశారని కూడా అంటున్నారు. మొత్తానికి కోర్టు ఆ చార్జిషీటును తిరస్కరించడంతో అటు సీఐడీతో పాటు.. ఇటు అధికార పార్టీకి షాక్ తగిలింది.