ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.99 వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో రూ.18 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మరో రూ.4 వేల కోట్లను బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు ఆరోపించారు లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఓ మౌలిక వసతుల కంపెనీ పేరుతో ఎన్.సునీల్‌రెడ్డి అనే వ్యక్తి రూ.2 వేల కోట్లు దుబాయికి తరలించారని ధ్వజమెత్తారు. ఈ లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ విభజన శాస్త్రీయంగా జరగలేదన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉండేదన్నారు. 2014-24 మధ్య కాలంలో జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17% నుంచి 14.4%కి తగ్గిపోతే.. ఏపీలో మాత్రం 24% నుంచి 35%కి పెరిగిందన్నారు. అంటే రాష్ట్రం వ్యవసాయంపై ఆధారపడటం పెరిగిపోయిందన్నారు. ఇదే సమయంలో సేవా రంగం వాటా 51% నుంచి 41%కి పడిపోయిందని..అందువల్ల కేంద్రం రాష్ట్రం అడుగుతున్న రెవెన్యూ లోటు భర్తీ చేయాలని కోరారు. అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనే కాకుండా గత ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలు కూడా రాష్ట్ర ఇబ్బందులకు కారణమన్నారు.
ఏపీలో గడిచిన ఐదేళ్లలో మద్యం పేరిట జరిగిన వసూళ్లు…బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాల రికార్డులను బ్రేక్ చేశాయన్నారు లావు శ్రీ కృష్ణదేవరాయలు. ఈ కుంభకోణం పరిణామాలు పార్లమెంటులోనూ కనిపించాయన్నారు. దీనివల్లే రాజ్యసభలో ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉండగానే ఓ ఎంపీ రాజీనామా చేసి, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారని చెప్పారు. సినిమాలకు ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని…ఏపీ మద్యం కుంభకోణంలోనూ అదే శైలి కొనసాగిందని చెప్పారు. అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని గత పాలకులు ప్రీ పొడక్షన్ స్థాయిలో ప్రచారం చేశారన్నారు లావు. చౌకధరలకు మద్యం అమ్మాలని ఒత్తిడి తెచ్చి అంతర్జాతీయ బ్రాండ్లన్నింటినీ వెళ్లగొట్టారని ఆరోపించారు.
రాష్ట్రంలోని 22 డిస్టిలరీలను చేజిక్కించుకోవడంతోపాటు 26 కొత్త కంపెనీలను ప్రారంభించారని చెప్పారు లావు. వాటిలో ప్రెసిడెంట్ మెడల్, హెచ్‌టీ గోల్డ్‌విస్కీ, ఎనీటైం గోల్డ్..ఇలా రకరకాల బ్రాండ్లతో మద్యం తయారుచేయించారని. ఈ బ్రాండ్లను ఏపీఎస్‌బీసీఎల్ కొని, ప్రభుత్వ దుకాణాల్లో నగదు లావాదేవీల ద్వారా విక్రయించిందని చెప్పారు. 2019-24 మధ్య కాలంలో రిటైల్ దుకాణాల ద్వారా అమ్మిన మొత్తం రూ.99 వేల కోట్లలో కేవలం రూ.690 కోట్లు మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిగాయని చెప్పారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు ఆ అయిదేళ్లలో రూ.లక్ష కోట్ల నుంచి రూ.200 లక్షల కోట్లకు పెరిగితే ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాల్లో మాత్రం అది రివర్స్‌లో జరిగిందన్నారు. ఇందులో దాదాపు రూ.18 వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని చెప్పారు.