మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కుకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. గడిచిన ఐదేళ్లూ వైసీపీ సర్కార్ మల్లవల్లిని పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాదు..గతంలో భూములు పొందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసింది. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరణ చర్యలు స్టార్ట్ చేసింది. 2018కి ముందు మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో భూములు కేటాయించిన..347 మంది పారిశ్రామికవేత్తలను వెనక్కి రప్పించింది. వారందరికీ తిరిగి ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను సోమవారం పూర్తి చేసింది.
విజయవాడలో ఆటోనగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్‌లోAPIIC ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు కేటాయించారు. వీరిలో 130 మందికి గతంలో కేటాయించినచోటే తిరిగి ఇవ్వనున్నారు. మిగతా 247 మందికి లాటరీ విధానంలో ప్లాట్లను కేటాయించారు. గతంలో బాబు సర్కారు ప్రకటించిన ఎకరం రూ.16.50 లక్షలకే తాజాగా కేటాయింపులతో..వీరి ఆనందానికి అవధుల్లేవు.
2019లో జగన్ సర్కారొచ్చాక ఒక్కో ఎకరా ధర రూ.73 లక్షలు అదనంగా పెంచేసింది. దీంతో ఎకరం రూ.89.50లక్షలకు పెరిగింది. పారిశ్రామికవేత్తలు టీడీపీ హయాంలో ఎంత ఉత్సాహంగా వచ్చారో..వైసీపీ దెబ్బకు అంతే నిరాశగా వెనక్కి వెళ్లిపోయారు. కొందరు అప్పటికే ప్లాంట్లు పెట్టుకోగా..వారినీ వదలకుండా పెంచిన ధర వసూలు చేశారు. కొందరు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. తాజాగా వారి సమస్యను ఒకేసారి పరిష్కరించి..పాత ధరకే తిరిగి ప్లాట్లను APIIC కేటాయించింది.
6 నెలల్లో ప్లాంట్ స్టార్ట్ చేయాలి –
గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లు అందుబాటులో ఉన్నోళ్లందరికీ వాటినే తిరిగి ఇప్పుడు ఇచ్చేశారు. లేని వారికి మాత్రమే లాటరీ విధానంలో కేటాయించారు. ఈ 347 మందికి వారంలో రీఆర్డర్లు ఇచ్చి..అందరికీ రిజిస్ట్రేషన్లు చేస్తారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక గత అక్టోబరులో జీవో నెంబర్ 65 ప్రకారం..ప్లాట్లు కేటాయించిన పారిశ్రామికవేత్తలంతా ఆరు నెలల్లో వారి స్థలాల గ్రౌండింగ్ పనులు పూర్తిచేయాలి. ఆ తర్వాత మిగతా ప్లాంట్ల ఏర్పాటు పనులు ఆరంభించి..ఇచ్చిన గడువులోగా పూర్తిచేయాలి. మల్లవల్లిలో తాజాగా కేటాయింపులు చేసిన పరిశ్రమల్లో..బాయిలర్స్,మెకానికల్,నట్లు బోల్టుల తయారీ, రక్షణ రంగ విడిభాగాలు, ప్లాస్టిక్ సహా అన్ని రంగాలవీ ఉన్నాయి.
వేలాది ఉద్యోగాలు –
మల్లవల్లిలో ఇప్పటికే 75 ఎకరాల్లో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ యూనిట్ ప్రారంభమైంది. ఇక్కడ రెండు దశల్లో రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏటా 4,800 బస్సులు ఇక్కడ తయారు చేయనున్నారు. మరికొన్ని పరిశ్రమలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా మరో 347 మందికి ప్లాట్లను APIIC కేటాయించింది. వీటితో కొన్ని వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఈ ఇండస్ట్రీయల్ పార్క్ విస్తీర్ణం 1467 ఎకరాలు కాగా..347 మందికి ప్లాట్లు కేటాయించారు. 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కాక మరో 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరకనుంది.