ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డికి సొంత పార్టీ నుంచే నిరసన సెగ తగిలిందా ? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొత్త ట్విస్ట్ కు అదే అసలు కారణమా ? వైసీపీ అధినేతను భయపెట్టిన ఆ నాయకులు ఎవరు ? మంత్రివర్గ కూర్పులో మారుతున్న సమీకరణాలు ఏమిటి ?
వంద గొడ్లను తిన్న రాబంధు ఒక్క గాలివానకు నెలకూలింది.. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిస్థితి సరిగ్గా ఇలాగే తయారయ్యిందట.ఇన్నాళ్ళూ తన మాటే శాశనం అంటూ మోనార్క్ లా వ్యవహరించిన జగన్ కు ఒక్కసారిగా నిరసన సెగ తగిలిందట.అదీ సొంత పార్టీ నేతల నుంచే కావడం విశేషం. దీంతో మొదటి సారి జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతున్నారనే చర్చ జోరందుకుంది.
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన క్యాబినెట్ లోని మంత్రులు అందరితో రాజీనామా చేయించి.. కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేయాలని సిఎం జగన్ నిర్ణయించారు.ఈ క్రమంలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై గవర్నర్ ను కలిసి వివరించిన జగన్ ఈ నెల 7 వ తేదీన మంత్రులు అందరితో రాజీనామా కూడా చేయించారు. అదేసమయంలో 11 వ తేదీన కొత్త మంత్రివర్గ కూర్పుపై కసరత్తు కూడా ప్రారంభించారు.అందులో భాగంగానే కొత్తగా క్యాబినెట్ లోకి ఎవరిని తీసుకుంటే బాగుంటుందో సూచించాలని రాజీనామా చేసిన మంత్రులను జగన్ కోరారట. అయితే ఇదే అంశం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిందని టాక్.
రాజీనామా ప్రస్తావన వచ్చిన నాటి నుంచే మంత్రివర్గంలోని సీనియర్ లు అలకపాన్పు ఎక్కినట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారట.కొందరు మంత్రులు తమని క్యాబినెట్ తొలగించవద్దని విజ్ఞప్తులు చేసుకుంటే..మరికొందరు మాత్రం బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తపరిచారట. దీంతో ఆలోచనలో పడిన జగన్.. సామాజిక సమీకరణల కారణం చూపుతూ ఒకరిద్దరు మంత్రులను కొనసాగిస్తానని చెప్పారు. కాగా ఇదే అంశం సీనియర్ మంత్రుల్లో అసంతృప్తి రాజేసిందట.కొందరిని కొనసాగించి, కొందరిని తొలగిస్తా అంటూ ముఖ్యమంత్రి చెప్పడం వారంతా అవమానంగా భావించిన సీనియర్ లు ఉంచితే అందరినీ ఉంచాలి, తొలగిస్తే అందరినీ తొలగించాలి అనే డిమాండ్ ను హై కమాండ్ వద్ద పెట్టారనే చర్చ వైసీపీ వర్గాలలో బలంగా వినిపించింది.అదే సమయంలో తమను తొలగిస్తే జిల్లాల్లో తమకున్న ప్రాధాన్యత తగ్గిపోతుందని, అది రాజకీయంగా తమకు ఇబ్బందికరమవుతుందని.. ఈ నేపధ్యంలో తమను కొనసాగించాలని కొందరు మంత్రులు కోరినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఆఖరి క్యాబినెట్ సమయంలోనూ మంత్రుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అయ్యిందట. ఎప్పుడూ లేని విధంగా మంత్రులలో కొత్త భయం వారిలో స్పష్టంగా కనిపించిందనే చర్చ రాజకీయ వర్గాలలో నెలకొంది. ఎవరిని ఉంచుతారూ, ఎవరిని తొలగిస్తారు అనే అంశం పై మంత్రులు అంతా లోలోపల మదనపడ్డారట.ఈ నేపధ్యంలోనే మంత్రులు పై పైకి నవ్వులు పూయించినా.. లోపల దుఃఖ సాగరంలో ఉన్నారనే చర్చ వైసీపీ వర్గాలలో నెలకొందట. ఇక రాజీనామాల అనంతరం మంత్రులలో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకున్నట్లే కనిపించిందట.
మరోవైపు క్యాబినెట్ లోని మంత్రులు అందరినీ తొలగించడం ఒక అనాలోచిత చర్య అని..రాబోయే రోజుల్లో ఇది వైసీపీకి పెద్ద దెబ్బగా మారనుంది అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాలలో జోరుగా సాగింది. ఇక సీనియర్ ల అలకలు, అసంతృప్తులు జగన్ కు తలనొప్పిగా మారాయట.దీంతో మంత్రివర్గ కూర్పు అంశంలో జగన్ పునరాలోచనలో పడ్డారట.మొదట మంత్రివర్గంలో ముగ్గురు లేదా నలుగురు పాత మంత్రులను కొనసాగిస్తారన్న టాక్ వినిపించగా , ఇప్పుడు ఆ సంఖ్య మారిందట. దాదాపు 11 మంది పాత మంత్రులను క్యాబినెట్ లో కొనసాగించే అవకాశాలు ఉందనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతొందట.
ముఖ్యంగా వైసీపీలో సీనియర్ లుగా ఉన్న బొత్స, పెద్దిరెడ్డి, బాలినేని, పేర్ని నాని వంటి మంత్రుల నుంచి వినిపించిన అసమ్మతి స్వరమే క్యాబినెట్ కూర్పులో తాజా పరిణామాలకు కారణమనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. సీనియర్ ల దెబ్బకి ఎప్పుడూ “తన మాటే శాశనం” అనేలా వ్యవహరించే జగన్ కూడా మొదటిసారి తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ వీరిని కూడా తన క్యాబినెట్ లో కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది. వారితో పాటు చెల్లబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజు,ఆదిమూలపు సురేష్ లను కూడా మంత్రివర్గంలో కొనసాగిస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఇక కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గానికి సంబంధించి కులాల వారీగా జగన్ కసరత్తు చేశారని , బీసీలకు 9, ఎస్సీలకు 6, ఎస్టీలకు 2 , రెడ్డిలకు 3 ,కాపులకు 3, కమ్మ , ముస్లిం సామాజిక వర్గాలకు ఒక్కో మంత్రి పదవులు ఇవ్వనున్నారని సమాచారం. కొత్తగా క్యాబినెట్ లోకి శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, విశాఖ జిల్లా నుంచి గుడివాడ అమర్నాధ్ , కృష్ణ జిల్లా నుంచి జోగి రమేష్, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కె.అబ్బయ్యచౌదరి,పి.గన్నవరం ఎమ్మె ల్యే కొండేటి చిట్టిబాబు లకు బెర్త్ లు ఖాయమయ్యాని వైసీపీ వర్గాలలో ప్రచారం జోరుగా సాగుతోంది.
మొత్తం మీద మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశంలో సీనియర్ ల అలకలు, అసంతృప్తులు జగన్ కు తలనొప్పిగా మారిన నేపధ్యంలో ఊహాగానాలు, అటా భోగట్టాలు కాకుండా అసలు జగన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరి దీనిపై స్పష్టత రావాలంటే ఏప్రిల్ 11 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
Must Read:-జగన్ గజదొంగలను మించిపోయాడు – చంద్రబాబు