ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు రాబోతుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు దగ్గర భారీ గ్రీన్ అమ్మోనియా తయారీ ప్లాంటు ఏర్పాటు కాబోతుంది. రెండు కంపెనీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నాయి. ఈ పరిశ్రమలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కూడా జరగనుంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో పారిశ్రామికంగా మరో కీలక ముందడుగు పడనుంది.
ఇండియాకు చెందిన జునో జౌలె గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, జర్మనీకి చెందిన సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ జీఎంబీహెచ్ కంపెనీలు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నాయి. నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ హైడ్రోజన్ సమిట్-2025లో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఏడాదికి మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. దీని ద్వారా 180 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్లాంటును మూడు దశల్లో మూలపేట పోర్ట్ దగ్గర అభివృద్ధి చేస్తారు..సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే ప్లాంటును కూడా ఏర్పాటు చేస్తారు.
ఏటా మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా తయారు చేసేలా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఎలక్ట్రోలసిస్ ద్వారా 180 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఎలక్ట్రోలసిస్ అంటే నీటిని ఉపయోగించి హైడ్రోజన్ ను తయారు చేయడం. జేజే గ్రీన్ ఎనర్జీ సంస్థ CEO రాయపాటి నాగశరత్, సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ జీఎంబీహెచ్ ఎండీ ఫెలిక్స్ డేంజర్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి పాల్గొన్నారు.
ఇక ఇప్పటికే మూలపేట దగ్గర పోర్టు నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకూ 50 శాతం మేర పనులు పూర్తయ్యాయి. గత 10 నెలలుగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. పోర్టుకు సంబంధించి బెర్తుల పైలింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించే ప్లాన్‌లో ఉన్నారు అధికారులు.











