నకిలీ రా ఏజెంట్‌గా చలామణి అవుతూ ఓ మహిళను మోసం చేసిన ఘరానా కేటుగాన్ని పోలీసులు పట్టుకున్నారు. నాలుగేళ్లుగా తాను రా ఏజెంట్‌నంటూ ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరోకు పని చేస్తున్నట్లుగా మహిళను నమ్మించి మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. బంగారం, నగదు కోసమే మహిళలను మోసం చేసినట్లుగా విచారణలో తేలింది. అయితే ఈ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నకిలీ రా ఏజెంట్‌గా ఆనంద్ వర్ధన్ చెలామణీ అయ్యాడు. రా ఏజెంట్‌తోపాటు ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరోకు పనిచేస్తున్నట్లు మహిళను నమ్మించాడు. గోవాలో తనని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా బాధితురాలను నమ్మించేలా ఆనంద్ ప్లాన్ చేశాడు. కావాలనే ఆనంద్ తన లాప్‌టాప్‌లో మెయిల్ ఓపెన్ చేసి బాధితురాలి దగ్గర ఉంచాడు. ఆ తరువాత ఆనంద్ కనిపించకపోయాడు. ప్లాన్‌లో భాగంగా తన మెయిల్స్‌కు తానే కిడ్నాప్, హత్యకు గురైనట్లు మెయిల్స్ పంపుకున్నాడు. అయితే బాధితురాలును నమ్మించేందుకే మెయిల్స్ పంపినట్లు ఆనంద్ విచారణలో ఒప్పుకున్నాడు.
సీనియర్ ఆర్మీ అధికారుల పేర్లతో మెయిల్స్ పంపేవాడు. బాధితురాలు తండ్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి కావడం గమనార్హం. ఇది పసిగట్టి నాలుగేళ్లుగా బాధితురాలిని మోసం చేస్తూ వచ్చినట్లు తెలిపారు. కేవలం బాధితురాలి దగ్గర ఉన్న బంగారం, నగదు కోసమే మొత్తం డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఆనంద్ వర్ధన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఇంకా ఎంతమందిని ఆనంద్ మోసం చేశాడనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు.











