బెజవాడ కనకదుర్గ గుడి పాలక మండలి భవనంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ కార్పొరేటర్ అభ్యర్ధులతో సమావేశం నిర్వహించడం పెద్ద దుమారమే లేపింది. దుర్గగుడిలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో మీటింగ్ పెట్టడాన్ని ప్రతిపక్ష టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. దుర్గగుడి పాలక మండలి భవనంలో వైసీపీ నాయకులతో మీటింగ్ పెట్టి పార్టీ కార్యాలయంగా మార్చిన దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను పదవి నుంచి తొలగించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. దుర్గగుడి ఆదాయంతో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు సకల అతిథి మర్యాదలు చేయడాన్ని బొండా ఉమ తప్పుపట్టారు.
రథం వెండి సింహాలు ఎవరింట్లో ఉన్నాయో అందరికీ తెలుసు
రెండు నెలల క్రితం మాయమైనట్టు గుర్తించిన దుర్గమ్మ రథం వెండి సింహాల ప్రతిమలు ఎవరి ఇంట్లో దాచారో అందరికీ తెలుసని బొండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని ఆయన విమర్శించారు. దేవాలయాల రథాలను దగ్ఢం చేయడం, వెండి సింహాలు మాయం చేయడం, దేవతా విగ్రహాలు ధ్వంసం చేయడంలాంటి ఘటనల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతీశారని బొండా ఆవేదన వ్యక్తం చేశారు.
వెండి సింహాల కేసు మూసేసినట్టేనా?
సంచలనం రేపిన బెజవాడ దుర్గమ్మ రథం వెండి సింహాల ప్రతిమల మాయం కేసు మరుగున పడిపోతోంది. వెండి సింహాల ప్రతిమల చోరీ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను నియమించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు అడుగు ముందుకు పడలేదు. ఇక వెండి సింహాల ప్రతిమల కేసు అటకెక్కినట్టేననే భావన అమ్మవారి భక్తుల్లో కలుగుతోంది.
దుర్గమ్మ డిపాజిట్లపై కన్నేసిన వైసీపీ ప్రభుత్వం
బెజవాడ దుర్గమ్మ ఆలయానికి చెందిన రూ.25 కోట్లు పలు జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఈ నిధులపై ప్రభుత్వం కన్నేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పాలకమండలి, దుర్గగుడి ఈవో కలసి అమ్మవారి డిపాజిట్లను ప్రభుత్వానికి కట్టబెట్టే ప్రయత్నాలను మానుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. దుర్గగుడి డిపాజిట్లు రూ.6 కోట్లు వివిధ రూపాల్లో ఇప్పటికే ప్రభుత్వానికి బదిలీ చేయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











