నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో దళితుల భూములతో పాటు మాజీ సైనికుల భూములను అక్రమంగా లాగేసేందుకు పెద్ద కుట్రే జరిగిందని, ఈ కుట్రలో నాటి టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్యులతో పాటు కీలక అధికారుల పాత్ర ఉందని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించుకున్న నాటి సీఎం చంద్రబాబు.. గుట్టు చప్పుడు కాకుండా పకడ్బందీగా అసైన్స్ భూములను లాగేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ఆర్కే పలు సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి భూముల అక్రమాల్లో చంద్రబాబు, ఆయన మంత్రులకు ఎంత పాత్ర ఉందో.. చంద్రబాబు సర్కారుకు సహకరించిన అధికారులకు కూడా అంతే పాత్ర ఉందని కూడా ఆర్కే ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారుల పేర్లను ప్రస్తావించిన ఆర్కే… వారందరినీ అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని, దళితులను బెదిరించి భూములు లాక్కున్న బ్రహ్మానందరెడ్డి వంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన సీఐడీ అధికారులను డిమాండ్ చేశారు.
మంత్రులు నారాయణ, పుల్లారావులే కీలకం
అమరావతి రాజధాని కోసమంటూ భూములను సేకరించే క్రమంలో కొత్తగా ప్రవేశపెట్టిన ల్యాండ్ పూలింగ్ కింద వేలాది ఎకరాలను సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం… దళితుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తన అనుచరులకు దక్కిన తర్వాతే వాటిని ప్రభుత్వం సేకరించేలా వ్యూహం రచించిందని ఆర్కే ఆరోపించారు. ఇందులో భాగంగా నాడు చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రులుగా ఉన్న పొంగూరు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. సీఆర్డీఏ ఏర్పాటుకు ముందే మంగళగిరి పరిధిలోని భూముల వివరాలన్నింటినీ ఈ ఇద్దరు మంత్రులకు చేరాయని.. ఈ భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను నారాయణ స్వయంగా తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ విషయాలను సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్ వెల్లడించారని ఆర్కే చెప్పుకొచ్చారు. తమ ప్లాన్ కు సహకరిస్తారన్న భావనతోనే అర్హత లేకున్నా… చెరుకూరి శ్రీధర్ కు ప్రమోషన్ ఇచ్చి మరీ ఆ పోస్టులో నియమించారన్నారు. అందుకోసం అప్పటిదాకా ఆ పోస్టులో కొనసాగుతున్న నాగులపల్లి శ్రీకాంత్ ను తప్పించారని కూడా ఆర్కే ఆరోపించారు.
మాస్టర్ మైండ్ రిటైర్డ్ ఐఏఎస్ సాంబశివరావే
అమరావతి పరిధిలోని 4-5 వేల ఎకరాల దళితుల అసైన్డ్ భూములను కొట్టేసేందుకు ప్లాన్ వేసిన చంద్రబాబు… తన ప్లాన్ ను పక్కాగా అమలు చేసేందుకు నాడు టీటీడీలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిని అమరావతికి రప్పించారని ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో ప్రజలతో నేరుగా సంబంధం లేని పోస్టులో సాంబశివరావును నియమిస్తున్నట్లుగా పేర్కొన్న చంద్రబాబు సర్కారు.. అమరావతిలోని దళితుల భూములను కొట్టేసేందుకు ఆయా రికార్డులను సేకరించేందుకు సాంబశివరావును ఏకంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో కూర్చోబెట్టిందని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేసిన సాంబశివరావు టీడీపీ ప్రభుత్వం ఆశించిన మేరకు గుంటూరు కలెక్టరేట్ కేంద్రంగా రాత్రింబవళ్లు కష్టపడి మరీ పనిచేశారని, చంద్రబాబు అనుకున్న మేరకు అన్ని వివరాలను సేకరించి మరీ అందజేశారని ఆర్కే పేర్కొన్నారు. ఈ క్రమంలో సాంబశివరావే ఈ కేసులో కీలక పాత్రధారి అని, ఆయనను అరెస్ట్ చేసి విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు బయటపడతాయని తెలిపారు.
ఈ అధికారులంతా శిక్షార్హులే
అమరావతిలోని దళితుల భూములు చంద్రబాబు ఆనుయాయులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చేరేలా సహకరించిన అధికారులందరి పేర్లను కూడా ఆర్కే వెల్లడించారు. గుంటూరు కలెక్టర్ గా వ్యవహరించిన కాంతిలాల్ దండే.. ఓ దళితుడై ఉండి దళితులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేదని సంచలన ఆరోపణలు చేసిన ఆర్కే. చంద్రబాబు పన్నాగాలకు సహకరించి వారి వద్ద డబ్బు తీసుకునమ్న కాంతిలాల్ దండేను దళితులు ఎంతమాత్రం క్షమించరన్నారు. ఇక గుంటూరు జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన మరో ఐఏఎస్ కోన శశిధర్ పైనా ఆర్కే ఆరోపణలు చేశారు. ఎమ్మార్వో, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్.. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కు కాకుండా నేరుగా సాంబశివరావుకే ఫైళ్లు వెళ్లాయని ఆర్కే ఆరోపించారు. ఈ తతంగం మొత్తం తన కళ్ల ముందే జరగుతున్నా కాంతిలాల్ దండే పట్టించుకోలేదన్నారు. ఇక సీఆర్డీఏ కమిషనర్ గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్ ది కూడా ఇందులో ముఖ్య భూమికేనని ఆర్కే ఆరోపించారు. ఇలా ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న అధికారులు అందరినీ విచారించాలని, అసలు నేరస్తులను అరెస్ట్ చేయాలని ఆర్కే డిమాండ్ చేశారు.
బ్రహ్మానందరెడ్డికి ఉన్న హక్కేంటి?
చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్రహ్మానందరెడ్డి.. అమరావతి పరిధిలోని దళితులను బెదిరించి వారి భూములను లాక్కున్నారని, ఈ క్రమంలో దళితులను భయభ్రాంతులకు గురి చేశారని కూడా ఆర్కే ఆరోపించారు. దళితుల భూములు లాగేసుకోవడానికి ఈ బ్రహ్మానందరెడ్డికి ఉన్న హక్కేమిటని కూడా ఆర్కే ప్రశ్నించారు. సీఐడీ అధికారులు తక్షణమే బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులను బెదిరిస్తూ వారి నుంచి భూములను బ్రహ్మానందరెడ్డి ఎలా లాక్కున్నారన్న వ్యవహారాన్ని వెల్లడించే దిశగా ఓ వీడియోను కూడా ఆర్కే ప్రదర్శించారు. దళితుల భూములన్నీ తమ చేతికి వచ్చాకే చంద్రబాబు సర్కారు.. అమరావతి ప్యాకేజీ ప్రకటిందని కూడా ఆర్కే ఆరోపించారు. ఇప్పటిదాకా ఈ వ్యవహారంలో తనకు అందిన ఆధారాలను సీఐడీకి అందించానని, ఇకపై కూడా ఇదే తరహాలో ఆధారాలను సీఐడీకి అందిస్తూనే ఉంటానని ఆర్కే ప్రకటించారు. మొత్తంగా ఆదివారం నాటి మీడియా సమావేశంలో ఆర్కే మరింత సంచలన ఆరోపణలు చేశారనే చెప్పాలి.











