తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డిపై.. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఇటీవలే టీఆర్ఎస్ గూటికి చేరిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సరికొత్త పోరును మొదలెట్టేశారు. అయితే తన ప్రత్యర్థులపై ఓ రేంజిలో విరుచుకుపడే రేవంత్ రెడ్డి.. స్వయంగా తనపైనే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న వారిని అంత ఈజీగా వదిలిపెట్టరు కదా. అందుకే.. తనపై విమర్శలు ఎక్కుపెట్టిన సుధీర్ రెడ్డిపై రేవంత్ తనదైన శైలిలో స్పందించారు. ఇక సుధీర్ రెడ్డి కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఘాటు పదాలతో కూడిన దాడిని మొదలెట్టారు. వెరసి ఈ ఇద్దరు నేతల మాటలు సాధారణ పదాలను దాటి రాళ్లు, చెప్పులు దాటిపోయి.. చివరకు చెప్పుల దండల దాకా వెళ్లిపోయింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెల్లని రూపాయలే
టీ పీసీసీ చైర్మన్ గా ఎన్నికైన వెంటనే డిల్లీ నుంచి హైదరాబాద్ లో ల్యాండైన రేవంత్ రెడ్డి.. తన ఎన్నికపై అసంతృప్త సెగలను కక్కుతున్న సీనియర్లను మచ్చిక చేసుకునే పని మొదలెట్టారు. ఇందులో ఆయన సఫలీకృతమవుతున్నట్లుగానే వరుస పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచి.. ఆ తర్వాత పార్టీకి ద్రోహం చేస్తూ టీఆర్ఎస్ లో చేరిన నేతలను టార్గెట్ చేసిన రేవంత్… పార్టీలు మారిన ఎమ్మెల్యేలను చెల్లని రూపాయితో పోల్చారు. అంతేకాకుండా కష్ట సమయంలో అండగా నిలిచి ప్రజా ప్రతినిధులుగా గెలిపించిన పార్టీకి ద్రోహం చేసిన నేతలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్లతో కొడతాయంటూ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.
రాళ్ల దాడికి చెప్పుల దాడితో సమాధానం
ఈ వ్యాఖ్యలపై వెనువెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తమపై రాళ్లు విసిరితే.. వారిపై టీఆర్ఎస్ శ్రేణులు చెప్పులతో దాడి చేస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతూ తనను తాను మర్యాద కలిగిన నేతగా.. ఆచితూచి మాట్లాడే నేతగా అభివర్ణించుకున్నారు. అంతేకాకుండా తాము మర్యాద కలిగిన నేతలుగానే ఉన్నా.. తమ పార్టీ శ్రేణులు, అనుచర వర్గం మాత్రం రాళ్ల దాడులకు చెప్పుల దాడితో బదులు చెబుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఎలా ఇస్తారని కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టే తాము పార్టీ మారామంటూ చెప్పుకొచ్చారు.
చెప్పుల దండలేస్తారట
చెప్పుల దాడి మాట వినంగానే.. రేవంత్ రెడ్డి కూడా ఓ రేంజిలో ఫైరైపోయారు. తమపై చెప్పుల దాడికి దిగే వారికి చెప్పుల దండలతో బదులు చెబుతామంటూ సుధీర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అయినా పార్టీకి ద్రోహం చేసిన నేతలకు చెప్పుల దండలేసినా తప్పు లేదని కూడా రేవంత్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా రేవంత్ రెడ్డి వర్సెస్ సుదీర్ రెడ్డిల మధ్య మొదలైన మాటల యుద్ధం.. రాళ్లు, చెప్పులు దాటిపోయి చెప్పుల దండల దాకా వెళ్లిపోయింది. మరి వీరిద్దరి మాటల మంటల్లో ఇంకెన్ని కొత్త పదాలు వినాల్సి వస్తుందోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.











