ఆమె ఓ ఉన్నత పోలీసు అధికారి. ధైర్య సాహసాలకు, నీతి నిజాయితీలకు మారుపేరు. విధి నిర్వహణలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. లెక్కచేయక దూసుకెళ్లే తత్వం.. ఆమె సొంతం. రాజకీయ ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగని ఆత్మస్థైర్యం.. ఆమె బలం. ఆమే..మణిపూర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) తౌనోజమ్ బృందా. సాధారణంగా మహిళల్లో శక్తిమంతమైన పోలీసు అధికారులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అప్పుడెప్పుడో కిరణ్ బేడీ గురించి విన్నాం. ఆమె ధైర్య సాహసాలను చూసి దేశమే ఉప్పొంగింది. మళ్లీ ఆ కోవకే చెందిన మరో పోలీసు అధికారిని చూస్తున్నాం.
ధైర్య సాహసాలకు ప్రభుత్వ ‘బ్రేవరీ మెడల్’
మణిపూర్ లో 2017లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ దందాను వెలికి తీయడంతో తౌనోజమ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన బడా రాజకీయ నాయకులు ఉండడంతో.. అందరి చూపూ ఆమెపై పడింది. ఒక మహిళ.. ఇంత పెద్ద కేసును డీల్ చేయగలదా అన్న సందేహాలూ వ్యక్తమయ్యాయి. ఇందుకు తగ్గట్లే ఆమెపై అనేక రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు. అయినా.. అవేవీ లెక్కచేయక.. ఆమె ధైర్యంగా ముందుకు సాగారు. దూకుడుగా వ్యవహరించారు. కేసును ఛేదించారు. దర్యాప్తును వేగంగా ముగించారు. నాటి ప్రతిపక్ష, ఇప్పటి అధికార పక్ష నాయకులపై పక్కా ఆధారాలతో చార్జిషీటు సమర్పించారు. నాటి ఆమె ధైర్య సాహసాలను మెచ్చిన ప్రభుత్వం.. ఏటా దేశభక్తుల దినోత్సవం (ఆగస్టు 13)నాడు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘బ్రేవరీ మెడల్’ను 2018 సంవత్సరానికి గాను తౌనోజమ్ బృందాకు అందించింది.
కోర్టులో కేసు నిలబడక పోవడంతో అవార్డు వెనక్కి
డ్రగ్స్ కేసును మూడేళ్లపాటు విచారించిన కోర్టు.. నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. పైగా.. కేసులో దర్యాప్తు జరిగిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన తౌనోజమ్.. రెండేళ్ల క్రితం ప్రభుత్వం తనకిచ్చిన గ్యాలంటరీ అవార్డును ఆదివారం వెనక్కి ఇచ్చేసింది. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి ఎన్ బిరేన్సింగ్ కు ఓ లేఖ రాశారు. డ్రగ్స్ కేసు సవ్యంగా దర్యాప్తు చేసినందుకు, సాహసోపేతంగా వ్యవహరించినందుకే నాడు ప్రభుత్వం తనకు ఈ అవార్డును ప్రదానం చేసిందని, ఇప్పుడు అదే కేసులో దర్యాప్తు తీరును కోర్టు తప్పుబట్టిందని, అందుకే తాను ఈ అవార్డుకు అర్హురాలిగా భావించడం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులందరూ నిర్దోషులుగా మారిపోయారని, ఇది పూర్తిగా తన వైఫల్యమేనని తెలిపింది. ఈ అవార్డును అర్హత కలిగిన మరో వ్యక్తికి అందించాలని కోరారు.
లెక్కచేయని తత్వం
ఈ డ్రగ్ కేసులో ప్రభుత్వ ఒత్తిళ్లనే కాదు.. కోర్టుల తీరును ఏనాడు లెక్కచేయలేదు బృందా. ఎంతో శ్రమించి పట్టుకున్న డ్రగ్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆగ్రహించిన ఈ యాంగ్రీ యంగ్ లేడీ జడ్జిని సైతం ధిక్కరించింది. అందుకు క్రిమినల్ కంటెమ్ట్ కోర్టు నమోదైన కనీసం పట్టించుకోని తత్వం ఆమెది. మణిపూర్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చూడడమే తన లక్ష్యమని ఎన్నో సార్లు చెప్పారు బృందా. రాష్ట్రంలో పిల్లలంతా ఈ డ్రగ్స్ బారిన పడడం చూసి, ఆ పరిస్థితి మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది లేడీ ఆఫీసర్. తను దర్యాప్తు చేస్తున్న 2018 సమయంలో దాదాపు 2.8 లక్షల విలువ చేసే 4.5 కేజీల హెరాయిన్, 57 లక్షల విలువచేసే ‘వరల్డ్ ఈజ్ యువర్స్’ అనే డ్రగ్స్‌ని సీజ్ చేయడంతో పాటు అధికార పార్టీ, ప్రతిపక్షం నేతలు అనే తేడా లేకుండా ఎవరినీ వదలలేదీ డేర్ లేడీ.
వృత్తి పట్ల నిబద్దత
ఏ కేసులోనైతే ప్రభుత్వం ఆమెకు మెడల్ అందించిందో.. అదే కేసును కోర్టు కొట్టేయడంతో ఆమె స్వచ్ఛందంగా తన మెడల్ ను వెనక్కి ఇచ్చేసింది. ఇలా చేయాలంటే.. తన వైఫల్యాన్ని ఒప్పుకోవాలంటే.. కొండంత ఆత్మస్థైర్యం, నిజాయితీ ఉండాలి. ఇప్పుడు అదే లక్షణం.. తౌనోజమ్ ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి ప్రదాతగా మార్చింది.