తెలుగు సినిమా ‘గతం’ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఇండియన్ పనోరమా కేటగిరీకి ఎంపికైంది. గోవాలో వచ్చే ఏడాది 16 నుంచి 21 వరకు జరిగే చిత్రోత్సవంలో ఈ సినిమాని ప్రదర్శిస్తారు. ఇందులో 25 చిత్రాలు, 21 నాన్ ఫీచర్ ఫిలిమ్స్ ను ప్రదర్శిస్తారు. గత ఏడాది ఈ కేటగిరీ కింద ‘ఎఫ్2’ చిత్రం ఎంపికైంది. అలాగే 2018లో ‘మహానటి’, 2017లో ‘బాహుబలి – ది కంక్లూజన్’, 2016లో ‘బాహుబలి – ది బిగినింగ్’ చిత్రాలను ప్రదర్శించారు. ఈసారి ఈ అవకాశం ‘గతం’ను వరించింది.
ఈ సినిమా నవంబరులో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రమాదంలో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వ్యక్తి కథ ఇది. అతనికి స్పృహ వచ్చాక తనెవరో తెలుసుకోవాలనుకుంటాడు. ఈ విషయంలో అతనికి ఓ యువతి సహాయపడుతుంది. వారిద్దరూ కారులో వెళుతుండగా ఓ చోట కారు ఆగిపోవడం, ఆ సమయంలో ఓ అపరిచితుడు వారిని కలిసి తన ఇల్లు సమీపంలోనే ఉందని, ఆ రాత్రికి తన ఇంట్లో ఉండోచ్చని ఆహ్వానిచడం జరుగుతుంది.
అతను తమను టార్గెట్ చేసి హింసిస్తున్నాడని అతను గ్రహిస్తాడు. అక్కడి నుంచి వారు తప్పించుకోవాలనుకుంటాడు. ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? ఎందుకు ఇతడిని టార్గెట్ గా చేసుకున్నాడు అన్నదే అసలు కథ. థ్రిల్లర్ మూవీగా ఇది తెరకెక్కింది. ఎవరూ ఊహించిని విషయాలను అతను ఎలా ఎదుర్కొన్నాడన్నది దర్శకుడు ఆసక్తికరంగా మలిచాడు. ఈ చిత్రానికి కిరణ్ రెడ్డి కొండమదుగుల దర్శకత్వం వహించారు.