మాస్ మహారాజ్ రవితేజ కూడా సర్ ప్రైజ్ ఇచ్చేశాడు. రవితేజకు తన మార్కు హిట్ వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భర్తీ చేయడానికే ‘క్రాక్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూర్తిగా తన బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్టుగా మాస్ మసాలా పాత్రతోనే రాబోతున్నాడని పోస్టర్ లు, ట్రైలర్ల ద్వారా అర్థమవుతోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలోని ‘విక్రమార్కుడు’ తరహా పోలీసు పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు.
మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు లాంటి సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి. ఈ సినిమా ట్రైలర్ ప్రారంభాన్ని కూడా బాస్ కా బాప్ పేరుతో వైరల్ చేసేస్తున్నారు. ‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజకు సరైన హిట్ దక్కలేదనే చెప్పాలి. అందుకే కసితో ఈ సినిమా చేసినట్టుంది. 2021 జనవరి 1వ తేదీ 11 గంటలకు ఈ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సినిమాలోని పాటలన్నిటినీ రామజోగయ్యశాస్త్రి రాశారు. గత ఏడాది సంగీత దర్శకుడు తమన్ ‘అల వైకుంఠపురముతో’తో బాక్సాఫీసు బద్దలు కొట్టాడు. ఈసారి ‘క్రాక్’తో ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘సేతుపతి’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. విశేషమేమిటంటే ఈ సినిమా కోసం వెంకటేష్ వాయిస్ ఓవర్ అందించడం. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.