విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమా రూపొందుతోంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. విజయ్ సరసన మాళవిక మోహనన్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. గత కొంతకాలంగా విజయ్ వరుసగా సంచలన విజయాలను సాధిస్తూ వస్తుండటం, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడానికి కారణమైంది. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగులోని విజయ్ అభిమానులు కూడా ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తిని చూపుతున్నారు.
ముందుగా చెప్పిన ప్రకారమే ‘దీపావళి’ కానుకగా కొంతసేపటి క్రితం ‘సన్ టీవీ యూ ట్యూబ్ ఛానల్’ లో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. విజయ్ … విజయ్ సేతుపతికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేపేలా వుంది. ఫైనల్ గా ఢీ అంటే ఢీ అంటూ ఇద్దరూ తలపడటంతో టీజర్ ముగిసింది.
విజయ్ అభిమానులు ఆశించిన విధంగా .. ఈ సినిమా సక్సెస్ పై వారికి గల నమ్మకాన్ని నిలబెట్టేదిగా ఈ టీజర్ వుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఈ రోల్ చేసినందుకుగాను ఆయనకి భారీ పారితోషికమే ముట్టిందట. ఇటు యూత్ ను .. అటు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతికి థియేటర్స్ కి తీసుకువచ్చే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
గతంలో విజయ్ చేసిన సినిమాల్లో తెలుగు అనువాదాలుగా వచ్చిన ‘సర్కార్’ .. ‘అదిరింది’ .. ‘పోలీసోడు’ ఇక్కడి ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ‘విజిల్’ మాత్రం అంతగా వసూళ్లను రాబట్టలేకపోయింది. మరి భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో వస్తున్న ‘మాస్టర్’ తెలుగులో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ మాత్రం ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల జాబితాలోకి చేర్చడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాగా ఆయన కమల్ తో ‘విక్రమ్’ చేయనున్న సంగతి తెలిసిందే.