తమకు అండగా ఉంటారనుకున్న రైతులు టీఆర్‌ఎస్‌పై తిరగబడుతున్నారు. మార్కెట్‌లో తమ కష్టాలకు ప్రభుత్వం నుండి భరోసా లేదంటూ ఆందోళనకు దిగుతున్నారు. క్యూలో నిలబడలేక , తమ వంతు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో కనీసం తిండి కూడా లేకుండా రైతులు పస్తులు ఉండాల్సిన దుస్థితి. మార్కెట్‌కు వెళ్ళిన రైతులు ఎప్పుడు ఇంటికి వస్తారో కూడా తెలియకుండా పోయింది. మార్కెట్‌పై అవగాహన , పలుకుబడి లేని వారు వారాల తరబడి రోడ్డుపైనే ఎదురు చూడాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో నియంతృత్వ సాగుకింద సన్నవడ్లే పండించాలని .. వారికే రైతుబంధు వేస్తామంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి తెలపడంతో రైతులంతా సన్న వడ్లు పండించారు. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది సాగు ఎక్కువై దిగుబడి కూడా ఘననీయంగా పెరిగింది. దీంతో మార్కెట్‌లో సన్నవడ్లు కొనేందుకు మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అయితే, ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
అన్ని జిల్లాల్లో అదే దుస్థితి..
గత 15 రోజుల నుండి రైతులు వడ్లు మార్కెట్‌కు తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా వరి ఎక్కువగా పండించే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మిర్యాలగూడా మార్కెట్‌కు పెద్ద ఎత్తున రైతులు తమ ధాన్యాన్ని తీసుకు వస్తున్నారు. సామర్ధ్యం కంటే ఎక్కువగా రైతులు వస్తుందటంతో మిల్లర్లు కొనలేక చేతులెత్తేస్తున్నారు. ఇక మార్కెట్లలో టోకన్ సిస్టం ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించడంతో టోకన్ల కోసం గంటల తరబడి లైన్లో నిలబడి రైతులు అవస్థలు పడుతున్నారు. ఇక ధాన్యంలో తేమ శాతం నిబంధన కూడా వారికి శాపంగా మారింది. 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే మిల్లర్లు, వ్యాపారులు కొనడం లేదు. ఇక రోజుల తరబడి బస్తాల్లోనే ఉండటంతో తేమ కారణంగా ధాన్యం నలుపెక్కతోంది. ఈ ధాన్యం వైపు ఎవరూ కనీసం కన్నెత్తి చూడటం లేదు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం పాడైపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక టోకన్ల కోసం లైన్లలో నిలబడిన రైతులు తోపులాటల కారణంగా గాయపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా 3000 కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ కాలేదు. ధాన్యం కొనుగోళ్లలో ఇదే ఆలస్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విపక్షాల మండిపాటు..
ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ సాగు విధానం రైతుల పాలిట శాపంగా మారిందని విపక్ష పార్టీల నేతలు అంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండించే రైతులకు తాము చెప్పిన పంటనే వేయాలంటూ ఆంక్షలు విధించడంతో ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ప్రభుత్వం ప్రతి గింజా కొంటామని చెబుతున్నా.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయక పోవడంతో మార్కెట్ల వద్ద యుద్ద వాతావరణం కనిపిస్తోంది . పంట దిగుబడి తగ్గడంతో తమకు ప్రభుత్వం ఇస్తున్న ఎంఎస్పీ ఏమాత్రం సరిపోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అధనంగా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులపై క్యాబినేట్ సమావేశంలో చర్చించింది. బోనస్ ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుంది, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత అన్న దానిపై ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ఓపెన్ చేయడం ద్వారా ధాన్యం వేగంగా కొనుగోలు చేసే వీలుంటుందని.. తద్వారా మార్కెట్‌కు వచ్చిన రైతులు త్వరగా ధాన్యం అమ్ముకుంటే ఆందోళన తగ్గుతుందని భావిస్తోంది. ఇక ఒకే మార్కెట్‌పై భారం పడకుండా ఉండేందుకు ఎక్కడి ధాన్యం అక్కడే కొనుగోలు చేసేలా స్థానికంగా మార్కెట్‌లు ఓపెన్ చేసి రైతు కష్టాలను తగ్గించాలనుకుంటోంది. ప్రభుత్వం వాటిని ఎంత త్వరగా ఓపెన్ చేస్తుందో.. రైతుల బాధలు ఎప్పటికి తొలుగుతాయో వేచి చూడాలి.