హైదారాబాద్ మేయర్ మాట గులాబి కోటలో చెల్లుబాటుకావడం లేనట్టు స్పష్టమవుతోంది. చర్లపల్లి డివిజన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్ బొంతు రాంమోహన్ స్థానం ఎవరికి కేటాయిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మేయర్ తన స్థానంలో సతీమణి బొంతు శ్రీదేవిని కూర్చోబెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు . అదిష్టానం ఇంకా దీనిపై ఎటూ తేల్చలేక చర్లపల్లి స్థానాన్ని హోల్డ్ లో పెట్టింది. చర్లపల్లి స్థానాన్ని ఎవరికీ కేటాయించ పోవడం వెనుక చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. మేయర్ బొంతు రాంమోహన్‌పై భూకబ్జాల ఆరోపణలు చాలా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను పక్కన పెట్టాలని గులాబి బాస్ భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసి గ్రేటర్ అబ్యర్థుల తొలి జాబితాలో మేయర్ భార్యకు టికెట్ గల్లంతైంది.
స్థానికులతో ముదిరిన వివాదం..
చర్లపల్లి టికెట్ కోసం స్థానికులు, స్థానికేతరుల మధ్య వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పంచాయితీ టీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బొంతు రాంమోహన్ స్థానికులతో మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. చర్లపల్లి స్థానం నుండి గత ఎన్నికల్లో అనూహ్యంగా పోటీ చేసిన ఆయన మొదటి నుండి మేయర్‌గా ప్రొజెక్ట్ అయ్యారు. దీంతో ఆయననే అధిష్టానం మేయర్‌ను చేసింది. మేయర్ అయిన తరువాత ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ టాప్ బాస్‌లు ఆయనను పక్కన పెట్టేసారన్న టాక్ వినిపిస్తోంది . అయితే నిన్న తన సతీమణి శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవితను కూడా ఆయన కలిశారు. దీంతో ఆ పార్టీ ఆయనకు మరోసారి అవకాశం ఇస్తుందని భావించారు. వివాదాలు పక్కన పెట్టి శ్రీదేవికి టికెట్ కేటాయిస్తారని ప్రచారం సాగింది. అయితే చర్లపల్లి స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం, బుజ్జగించినా మాట వినకపోవడంతో ఆ సీటును మొదటి లిస్ట్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
అప్పట్లో అలకనే ఇందుకు కారణమా..
అయితే దీని వెనక మరో కథ వినిపిస్తోంది. మేయర్‌గా ఉండగానే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఉప్పల్ టికెట్ కేటాయించాలంటూ 2018లో అదిష్టానంపై అలక బూనారు బొంతు రాంమోహన్. ఈ అంశం కూడా ఆయన సతీమణికి టికెట్ రాకుండా అడ్డుపడిందన్న టాక్ నడుస్తోంది. మేయర్ అయిన తరువాత చర్లపల్లి డివిజన్ ప్రజలతో సఖ్యతగా మెలగక పోవడం కూడా నేడు ఆయన ఇబ్బందికర పరిస్థితులకు కారణంగా తెలుస్తోంది. అయితే ఈ వివాదాలే ఆయనకు టికెట్‌కు దూరం చేసాయా లేదా ఆయన సేవలను మరే రకంగా అయినా వినియోగించేందుకు టీఆర్ఎస్ యోచిస్తోందా అనేది అంతు చిక్కడం లేదు. అనూహ్యంగా మేయర్ పీఠం ఎక్కిన ఆయనకు అంతకంటే చిన్న పోస్ట్ ఇచ్చే పరిస్థితి లేదు.. ప్రభుత్వంలో చేర్చుకునే అవకాశం కూడా లేక పోవడంతో ఆయన భవిష్యత్ ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది.
Must Read ;- మేయర్ పీఠంపై గ్రేటర్ అధికారిణి కన్ను.. మంత్రి ద్వారా టీఆర్‌ఎస్ టికెట్ యత్నం