ఒక పక్క రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. మరోపక్క రాజకీయ వలసలూ ఊపందుకుంటున్నాయి. బీజేపీ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో కొంత మంది అక్కడి లోకల్ గా ఉండే ముఖ్యమైన నేతలు టీఆర్ఎస్‌లోకి జంపయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ఉండే మరో నేత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే దుబ్బాక బీజేపీ బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డి కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కిషన్‌రెడ్డి అనుచరగణంలో ఒకరిగా రావుల శ్రీధర్ రెడ్డికి పేరుంది. రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీలో పనిచేస్తున్నారు. అయితే బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
11 ఏళ్లుగా బీజేపీ పార్టీలోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు సడన్‌గా రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలకు షాక్‌కు గురిచేసింది. కొన్ని రోజులుగా పార్టీ నేతలపై శ్రీధర్ రెడ్డి అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే తన రాజీనామాపై శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ ఒక ప్రైవేట్ బ్యాంకులో మంచి స్థానంలో ఉన్న తాను తెలంగాణ కోసం ఉద్యోగం వదిలి బీజేపీ పార్టీలో చేరానన్నారు. గత పది సంవత్సరాలుగా పార్టీకి సేవలు చేస్తున్నాని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా కూడా ప్రజల్లోనే ఉన్నానని ఆయన తెలిపారు. రాజీనామా చేసిన ఆయన బీజేపీపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం పూర్తి అబద్దాలతో ప్రజలను మభ్య పెడుతుందని, బీజేపీతో రాష్ట్రానికి న్యాయం జరగదని మండిపడ్డారు.
తాను కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్‌లో పనిచేయాలనుకుంటున్నానని తన అభిప్రాయాన్ని తెలిపారు. వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కేంద్రం విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం ఏదైనా బిల్లు తెస్తే పార్టీలో ఒక చర్చ కూడా లేదని… ఆ బిల్లు ద్వారా తెలంగాణకు లాభం అవుతుందా లేదా అనే చర్చనే ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు తెలుస్తోంది.
అయితే వలసలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి మామూలు విషయమే అయినప్పటికినీ ప్రస్తుతం దుబ్బాక, జీహెచ్ఎంసి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో నేతలు పార్టీలు మారడం ఆయా పార్టీలకు మైనస్సేనని చెప్పాలి.