తెలుగు జర్నలిజంలో ఈనాడు దినపత్రికకు ఎంత పేరుందో.. అంతే స్థాయిలో ఆ పత్రికలో కార్టూనిస్ట్ గా పనిచేస్తున్న శ్రీధర్ రావుకు ఉందనే చెప్పాలి. కార్టూనిస్ట్ శ్రీధర్ గా తెలుగు ప్రజలకు చిరపరచితుడు అయిన శ్రీధర్.. ఈనాడులో 4 దశాబ్దాలుగా కార్టూనిస్ట్ గా పనిచేస్తున్నారు. అయితే అనూహ్యంగా శ్రీధర్ సోమవారం ఈనాడుకు రాజీనామా చేశారు. ఈనాడును వీడానని, రాజీనామా చేశానని సోమవారం సాయంత్రం స్వయంగా శ్రీధరే తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈనాడుకు శ్రీధర్ రాజీమానా అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
నాలుగు దశాబ్దాలుగా..
ఈనాడు ప్రస్థానం మొదలైన తర్వాత ఆ పత్రిక తెలుగు మీడియా రంగంలో ఎన్నెన్ని సంచలనాలకు కేంద్ర బిందువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో నాలుగు దశాబ్దాల క్రితం ఈనాడులో కార్టూనిస్ట్ గా చేరిన శ్రీధర్.. తనదైన శైలి కార్టూన్లతో తెలుగు ప్రజలను ఇట్టే ఆకట్టుకున్నారు. ఈనాడు, కార్టూనిస్ట్ శ్రీధర్ లను విడదీసి చూడటం అన్నది అసాధ్యమన్న వ్యాఖ్యలూ వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే.. ఈనాడు ఎదుగుదలలో శ్రీధర్ కూడా తనవంతు కృషి చేశారు. కేవలం శ్రీధర్ కార్టూన్ల కోసమే తెలుగు ప్రజలు ఈనాడు పేపర్ ను కొన్నారన్న వాదనలు కాస్త అతిశయోక్తిగానే అనిపించినా.. ఈనాడు పేపర్‌ను కొన్న వారిలో చాలా మంది వార్తల కంటే కూడా శ్రీధర్ వేసే కార్టూన్లనే తొలుత చూసేవారు. ఈనాడు పత్రికతో పాటు ఆదివారం అందే అనుబంధం తెరిస్తేనే కనిపించే శ్రీధర్ కార్టూన్లైతే.. సాధారణ జనాన్ని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొత్తంగా శ్రీధర్‌కు ఈనాడు.. ఈనాడుకు శ్రీధర్ అన్నట్టుగా సాగిన ప్రయాణం 40 ఏళ్ల పాటు కొనసాగింది.
రాజీనామాకు కారణాలేమిటో..?
ఈనాడులో ఉద్యోగం అంటే సర్కారీ కొలువుతోనే సమానం. అలాంటిది ఈనాడును వదిలి బయటకు రావడం అంటే గుండె దిటవు చేసుకునే తీసుకున్న నిర్ణయంగానే పరిగణించాలి. ఈ క్రమంలో ఈనాడుకు శ్రీధర్ రాజీనామాకు గల కారణాలేమిటన్న కోణంలో వివిధ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే శ్రీధర్ పదవీ విరమణ చేయాల్సి ఉన్నా.. ఈనాడు ఆయన అట్టిపెట్టుకుంది. అంటే.. రిటైర్మెంట్ వయసు వచ్చాక కూడా శ్రీధర్ రెండేళ్లకు పైగా ఈనాడులో కొనసాగినట్టే లెక్క. అయితే ఇటీవల సంస్థ యాజమాన్యంతో వచ్చిన విభేదాల కారణంగానే శ్రీధర్ రాజీనామా చేశారని కొందరు, వేతనం విషయంలోనూ తలెత్తిన విభేదాలతో శ్రీధర్ రాజీనామా చేశారని మరికొందరు చెబుతున్నారు. అయితే తన రాజీనామాకు కారణమేమిటన్న విషయాన్ని చెప్పకుండానే.. గౌరవప్రదంగా ఈనాడుకు శ్రీధర్ వీడ్కోలు పలికారు.
Must Read ;- అంత చిన్నదైతే.. ఇంత హడావిడేల?











