ఒకరు మెగాస్టార్ చిరంజీవి, ఇంకొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఇద్దరి పుట్టిన రోజులూ ఈ నెలలోనే వస్తున్నాయి. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న అయితే, చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22. విశేషమేమిటంటే వీరిద్దరూ ఈ పుట్టిన రోజున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున అభిమానులు రక్తదానం, నేత్రదానం లాంటివే కాకుండా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేస్తుంటారు. ఈసారి ప్రత్యేకంగా మొక్కలు నాటడం మీదే దృష్టిపెట్టారు.
దీని మీద మెగాసోదరుడు నాగబాబు ఓ వీడియో బైట్ కూడా విడుదల చేశారు. రక్తదానం, నేత్ర దానంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మెగాస్టార్ అభిమానులు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజున కుటుంబంతో గడపాలని మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయం మీద ఇటీవల ఆయనను మీడియా ప్రశ్నించినప్పుడు పుట్టిన రోజు నాడు కుటుంబంతో దూరంగా వెళుతున్నానని చెప్పారు. కాబట్టి ఆరోజున ఆయనకు శుభాకాంక్షలు తెలపాలనుకుంటే అందుబాటులో ఉండకపోవచ్చు. నాగబాబు మాట్లాడుతూ ఏటా అభిమానులు చేస్తున్నట్లు గానే ఈసారి కూడా చేయాలని పిలుపునిచ్చారు.
మనకు ఆక్సిజన్ అనేది ఎంత అవసరమో ఈ కరోనా కాలం నిరూపించిందన్నారు. ‘ఇది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు మొక్క నాటితే మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోకపోయనా బతుకుతుంది. మనం మొక్కలను కొట్టేసి పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాం. పర్యావరణాన్ని పునరుద్దరించే బాధ్యతను తీసుకుందాం. వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి ఆక్సిజన్ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకుందాం. కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క చనిపోయారన్న మాటలు విన్నాం.
ఆక్సిజన్ అనేది మనకు ఎంతో ఆవసరం. ఆక్సిజన్ పీల్చుకుని మనం వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ ను మొక్కలు పీల్చుకుని మళ్లీ ఆక్సిజన్ వదులుతుంటాయి. మెగా అభిమానులంతా అన్నయ్య పుట్టిన రోజు మొక్కలు నాటడానికి ప్రాధాన్యం ఇవ్వాలి’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఒకేసారి నాలుగు ప్రాజెక్టులు చేపట్టి ఇంత బిజీగా ఉండటం ఇటీవల కాలంలో అరుదైన విషయం.
ప్రిన్స్ అభిమానులదీ అదే బాట
ఈ నెల 9వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులంతా మొక్కలు నాటాలని మహేశ్ బాబు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. మహేష్ బాబు ఇచ్చిన ఈ పిలుపుపై ఈ కార్యక్రమం ఫౌండర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి అభిమాని తలా మూడు మొక్కలు నాటాలని మహేష్ బాబు పిలుపునివ్వడం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి నిదర్శనం అన్నారు. గతంలో కూడా ఆయన మొక్కలు నాటిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో దుర్గా ఆర్ట్స్ నిర్మించే సినిమా కూడా ఆయన చేయాల్సి ఉంది.











