ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను జగన్ సర్కారు మళ్లీ మొదలుపెట్టింది. విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించే విషయంలో హైకోర్టు ఆదేశాలతో కాస్తంత స్పీడు తగ్గించిన జగన్ సర్కారు.. ఇప్పుడు అదే హైకోర్టు సూచనలతో న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసే దిశగా శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీలో జగన్ ప్రభుత్వం కర్నూలుకు ఈ రెండు కార్యాలయాలను తరలించే దిశగా సంచలన నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ తర్వాత సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఇదే విషయాన్ని వెల్లడించారు. హైకోర్టు సూచనల మేరకే తమ ప్రభుత్వం లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు.
నమ్మించి.. నట్టేట ముంచి..
2019 ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తానని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన మాటను జనం నమ్మేలా అమరావతి పరిధిలోని తాడేపల్లిలో రాజభవంతి లాంటి ఇంటిని కూడా ఆయన నిర్మించుకున్నారు. దీనిని చూసిన జనం జగన్ మాటను నమ్మేశారు. ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు గుద్దేశారు. అయితే అధికారంలోకి వచ్చినంతనే అమరావతి భూసేకరణలో అక్రమాలు జరిగాయంటూ నానా యాగీ చేసి.. అమరావతిని కేవలం శాసన రాజధానికి పరిమితం చేసి పరిపాలనా రాజధానిని విశాఖకు, న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించనున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. అయితే కోర్టులో కేసులు, వాటి విచారణలు, ఆ తర్వాత కరోనా మహమ్మారి నేపథ్యంలో మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కారు స్పీడు తగ్గించింది.
రాజధాని రైతులు ఊరుకుంటారా?
మరి ఇప్పుడు హైకోర్టు సూచనల మాట చెప్పి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నామని జగన్ సర్కారు ప్రకటించింది. ఈ ప్రకటనతో జగన్ సర్కారు మరోమారు మూడు రాజధానుల అంశానికి బూజు దులిపినట్టుగానే కనిపిస్తోంది. తాను అనుకున్నట్లుగా కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను ఏర్పాటు చేయగలిగితే.. ఇక పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు కూడా తమకు అడ్డు ఉండదన్న భావనలో జగన్ సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజధాని కోసం వేలాది ఎకరాల భూములను ఇచ్చిన అమరావతి రైతులు ఇప్పటికే జగన్ సర్కారుకు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూమూడు రాజధానులకు అడ్డుగా నిలుస్తున్నారు. మరి ఇప్పుడు కర్నూలుకు లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాల తరలింపు విషయంలోనూ వారు కోర్టులను ఆశ్రయిస్తే.. జగన్ సర్కారుకు బ్రేకులు పడతాయా? లేదంటే.. హైకోర్టు సూచనల మేరకే తాము ఈ చర్యలు చేపడుతున్నామని చెప్పి జగన్ సర్కారు ముందడుగు వేస్తుందా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది.











