మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా దాదాపు ఏడు నెలలుగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఈమధ్యనే లాక్ డౌన్ సడలింపులు జరిగాక అనేక సినిమాలు షూటింగ్లు రీస్టార్ట్ అయ్యాయి. కానీ చిరు చేస్తున్న ‘ఆచార్య’ సినిమా మాత్రం ఇప్పటికి మొదలుకాలేదు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో చిరు షూటింగ్ లో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే దేశంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతుండటంతో ఆయన కూడా చిత్రీకరణ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారట.
వచ్చే నెల మూడోవ వారంలో ‘ఆచార్య’ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఈలోపు దర్శకుడు కొరటాల శివ సినిమా షూటింగ్ కు సంబంధించిన పనులు పూర్తి చేస్తాడని తెలుస్తోంది. నవంబర్ 3వ వారంలోనే చిరంజీవి షూటింగ్ లో జాయిన్ అవుతారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. సింగిల్ షెడ్యూల్ తో ఈ సినిమా పూర్తి చేసి పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వెంటనే వినాయక్ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని చిరంజీవి చూస్తున్నారని సమాచారం.
వినాయక్ సినిమాతో పాటు మెహర్ రమేష్ తో చేయబోయే సినిమా షూటింగ్ కూడా పట్టాలెక్కిస్తారని టాక్ నడుస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆచార్య’ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. కొరటాల – చిరు కాంబినేషన్ కావడంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. మరి అభిమానుల అంచనాలను ఆచార్య ఏ స్థాయిలో నిలబెడతాడో చూడాలి.