తెలుగుతో పాటు తమిళ, హిందీ బాషలలో ఎక్కడ అవకాశాలు లభించినా చేసుకుంటూ వెళ్తున్న తమన్నా ఇకపై నటనకు అధిక ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకోవాలనుకుంటోంది. అందులో భాగంగా తెలుగులో నటిస్తున్న “సిటీమార్” చిత్రంలో నటనకు అత్యధిక అవకాశం కలిగిన పాత్రలో ఆమె మెరవబోతోంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ పాత్రలో తమన్నా నటిస్తుండటం ఓ విశేషం. ముఖ్యంగా మన భారతదేశ గ్రామీణ వాతావరణంలో కబడ్డీ ఆటకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. లోగడ స్పోర్ట్స్ డ్రామా నేపధ్య కథతో వచ్చిన చిత్రాలు “సై, తమ్ముడు, అమ్మా నాన్న..ఓ తమిళ అమ్మాయి, జెర్సీ, గురు” వంటి చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి వేరుగా చెప్పనక్కర లేదు.
ఇక ప్రత్యేకించి కబడ్డీ నేపథ్యంలో “ఒక్కడు, భీమిలి కబడ్డీ జట్టు, కబడ్డీ కబడ్డీ ” వంటి చిత్రాలొచ్చాయి. తాజాగా కబడ్డీ నేపథ్యంలో “సిటీమార్” చిత్రం రూపొందుతుండటంతో పాటు అందులో తమన్నా కబడ్డీ కోచ్ గా కనిపించబోవడం ఆసక్తిగా మారింది. మరోవైపు గోపీచంద్, దర్శకుడు సంపత్ నందిలకు కూడా సక్సెస్ అత్యంత ఆవశ్యకమైంది. దాంతో ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితులలో హిట్ చేయాలన్న తలంపుతో వారు ఉన్నారట. పైపెచ్చు తమన్నా చేస్తున్న కోచ్ పాత్రను ఎంతో బాగా తీర్చిదిద్దడంపై కూడా సంపత్ నంది ఎంతో శ్రద్ద పెట్టారట. తమన్నా కూడా తన పాత్రకు జీవం పోయాలని మరింతగా శ్రమపడుతోంది. ఇదిలావుండగా సోమవారం తమన్నా తన పుట్టినరోజు జరుపుకోనుంది.