బోర్లకు మీటర్లు అమర్చే విషయంపై తెలంగాణ మంత్రి హరీష్‌రావుకు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ గట్టిగానే ఇచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కేంద్రంతో ఒకరోజు సఖ్యతగా, మరో రోజు గొడవ పడటం తమకు రాదని అన్నారు. కేంద్రంతో గొడవ పడకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక సఖ్యత అవసరమని ఆయన చెప్పడం గమనార్హం. కేంద్రంతో తాము కలిసే ఉన్నామనే అంశాన్ని వైసిపి పార్టీ దీంతో మరొకసారి చెప్పినట్లయింది. రైతులకు ఉచిత విద్యుత్ బోర్లకు మీటర్లు అమర్చే విషయంలో కష్టాల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రానికి తాము మద్దతు ఇచ్చామని మంత్రి బాలినేని తెలిపారు.
కేంద్రం ఇచ్చే రూ.4వేల కోట్ల ఫండ్ ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తామని, ఆ ఫండ్‌ను తమ జేబుల్లో వేసుకోమనే విషయాన్ని మంత్రి హరీష్ రావు గ్రహించాలని ఏపీ మంత్రి విమర్శించారు. కేంద్రంతో తాము స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బుల కోసం బోర్లకు మీటర్లను అమర్చే విధానాన్ని ఏపీ ప్రభుత్వంలాగా తాము మద్దతివ్వబోమని మంత్రి హరీష్ రావు జగన్ ప్రభుత్వాన్ని గతంలో విమర్శించిన విషయం తెలిసిందే. అయితే మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బాలినేని ఈవిధంగా కౌంటర్ ఇచ్చారు.
ఆనాడు హరీష్ ఏమన్నారు..
వ్యవసాయ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అమర్చే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందని హరీష్ అన్నారు. రైతు ఉపయోగించే ప్రతి బావికి, బోరుకు విద్యుత్ మీటర్ పెడితే తెలంగాణ రాష్ట్రానికి రూ.2500 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణ సిఎం తిరస్కరించారన్నారు. కానీ రూ.4 వేల కోట్లకు ఆశపడిన ఏపీ ప్రభుత్వం ఆ డబ్బు తెచ్చుకుని మీటర్ల పేరుతో ఆంధ్రా రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. అయితే హరీష్ ఆరోపణలపై ఏపీ మంత్రి బాలినేని కౌంటర్ ఇవ్వడం రాజకీయ చర్చకు దారి తీసింది.
ఇప్పుడు మంత్రి బాలినేని ఏమన్నారు..
తెలంగాణ ప్రభుత్వంలా కేంద్రంతో ఒకరోజు మంచిగా మరో రోజు వైరం పెట్టుకునే ధోరణీ తమకు లేదని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి…హరీష్‌రావును విమర్శించారు. మరో 30 ఏళ్ల పాటూ రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో మాట తప్పమని రైతులకు హామీ ఇస్తున్నామన్నారు. డిస్కంలకు చెల్లించవలసిన బిల్లును కూడా నేరుగా రైతుల అకౌంట్లలో ముందుగానే డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. అయితే తెలంగాణ, ఏపీ సిఎంలు ఇద్దరూ స్నేహంగానే ఉంటున్నా అక్కడి, ఇక్కడి మంత్రులు మాత్రం కయ్యానికి కాలుదువ్వుతున్నారనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.