భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. గల్లీలు కాల్వలను తలిపిస్తే.. రహదారులు చెరువులను తలిపించాయి. దీంతో లోతట్టు కాలనీలు, ప్రాంతాలు నీటమునిగాయి. పలువురు వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. లారీలు, కార్లు నీటి ప్రవాహాంలో కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. ఇళ్లన్నీ నీట మునగడంతో ప్రజలు తీవ్ర బ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈక్రమంలో మంత్రి కెటిఆర్ బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఇందులో భాగంగానే ఎల్‌బినగర్ బైరామల్ గూడలలో మంత్రి కేటిఆర్ పర్యటించారు. కెటిఆర్ సమక్షంలోనే ఎమ్మెల్యేను స్థానిక ప్రజలు నిలదీశారు. మా ఇళ్లన్నీ నీట మునిగాయని, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని ఆ ప్రాంత ప్రజలు వాపోయారు. ఇన్నేళ్లల్లో ఎప్పుడైనా మా కాలనీకి ఎమ్మెల్యే వచ్చారా? అని కేటిఆర్ ముందే ఎమ్మెల్యేను స్థానికులు ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు టిఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలిసింది. అయితే అక్కడి పరిస్థతిపై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై మంత్రి కెటిఆర్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.
బైరామల్ గూడ, మరికొన్ని ప్రాంతాల్లోనూ మంత్రి కెటిఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, ఇతర నాయకులు కూడా పర్యటించారు. ఆయా ప్రాంత ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలు తమ సమస్యలను మంత్రికి ఏకరువు పెట్టారు. తమగోడును వెల్లబుచ్చుకున్నారు. ప్రజల సమస్యలను విన్న మంత్రి అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. మొన్నరాత్రి కురిసిన వర్షానికి నగరంలో ఇంకా సాధారణ పరిస్థితులు తలెత్తలేదు. ఇంకా కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. దీంతో ప్రజలు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరదల్లో కొట్టుకుపోయినా తమను ఏ నాయకుడు పట్టించుకోవట్లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, ఈరోజు, రేపు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తోంది.











