విజయవాడలో పది రోజుల కిందట జరిగిన కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దుండగుల కాల్పుల్లో పోలీస్ శాఖ ఉద్యోగి మహేష్ అక్కడిక్కడే చనిపోయారు. మరో వ్యక్తి గాయపడ్డారు. తుపాకీ కాల్పులతో బెజవాడ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బీహార్ కల్చర్ బెజవాడకు వచ్చిందని స్ధానికులు ఆందోళన చెందారు. ఈ కాల్పుల కేసులో కీలక నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన మూడు పోలీసు బృందాలు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కాల్పులకు ఉపయోగించిన తుపాకీ, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎందుకు కాల్పులు జరిపారంటే?
విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న మహేష్, అతని బావ మరిది గంగాధర్ పది రోజుల కిందట మద్యం సేవించేందుకు విజయవాడ రూరల్ గ్రామం నున్న బైపాస్ కు చేరుకున్నారు. అక్కడ మద్యం సేవిస్తూ, బిర్యానీ తెచ్చుకుని తింటుండగా, ఓ ఆటోలో కడప ఎస్బీఐ కాలనీకి చెందిన బీరం సాకేత్ రెడ్డి, మిత్రుడితో కలిసి అక్కడికి వచ్చారు. వచ్చీ రావడంతోనే మీరు అమ్మాయిలను తెచ్చుకున్నారా? వారి గురించే మాట్లాడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. మీరు ఇక్కడ నుంచి వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని సాకేత్ రెడ్డి ఆదేశించాడు.
దీంతో కోపోద్రిక్తుడైన మహేష్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని గట్టిగా చెప్పడంతో సాకేత్ రెడ్డి విచక్షణా రహితంగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో మహేష్ అక్కడికక్కడే చనిపోయాడు. మహేష్ బావమరిది గంగాధర్‌పై ఒక రౌండు కాల్పులు జరిపారు. అతను గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నిజానికి హత్యకు గురైన మహేష్ రెడ్డికి, హత్య చేసిన సాకేత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. తగాదా కూడా లేదు. వారిద్దరూ తాగుతుండగా.. అక్కడకు వచ్చిన సాకేత్ రెడ్డి అమ్మాయిల్ని కూడా తెచ్చుకున్నారా అంటూ అకారణంగా గొడవపెట్టుకున్నాడు. అంతలోనే గన్ తీసి కాల్పులు జరిపాడు
సాకేత్ రెడ్డి ఎవరు? వీరికి సంబంధం ఉందా?
కడప ఎస్బీఐ కాలనీకి చెందిన సాకేత్ రెడ్డి ఇంటీరియర్ కార్మికుడిగా పనిచేశాడు. హైదరాబాద్‌లో ఇంటీరియర్ పని చేస్తుండగా ఓ హోటల్ యజమానితో గొడవ జరిగింది. అతను సాకేత్ రెడ్డిని కొట్టడంతో అతనిపై పగ పెంచుకున్నారు. అతన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. బీహార్ వెళ్లి తుపాకీ, 12 బుల్లెట్లు కొనుగోలు చేశాడు.
విజయవాడలో ఓ వ్యక్తి వల్ల సాకేత్ రెడ్డి గతంలో రూ.2 లక్షలు నష్టపోయాడని సమాచారం. అతన్ని ముందుగా బెదిరించేందుకు విజయవాడ చేరుకుని, అతని స్నేహితుడు, ఆటోనడుపుకునే రాధాకృష్ణారెడ్డిని కలిశాడు. ఇద్దరూ కలసి మద్యం సేవించేందుకు నున్న బైపాస్ కు వచ్చారు. ఈ క్రమంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
పోలీసులకు ఎలా చిక్కారు?
సాకేత్ రెడ్డి, అతని స్నేహితుడు రాధాకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి ఆటోలో వచ్చారు. సమీపంలోని సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సాకేత్ రెడ్డి విజయవాడలో ఓ సెటిల్ మెంట్ తో పాటు, తెనాలిలో ఒకరిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు విచారణలో వెల్లడైంది.











