వైసీపీ ఎంపీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డికి బిగ్‌షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి…తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో మిథున్ రెడ్డికి కష్టాలు తప్పేలా లేవు.
జగన్ హయాంలో రూ.3 వేల కోట్ల మద్యం స్కామ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరిపింది. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్ ధరలను సైతం అమాంతం పెంచేసింది.
మద్యం నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ లిక్కర్ అమ్మకాలపై రకరకాల ప్రయోగాలు చేసింది. 2019 చివరలో కొత్త లిక్కర్ పాలసీని వైసీపీ ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. ప్రభుత్వమే మద్యం విక్రయించేలా వైన్ షాపుల్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. అదే సమయంలో మద్యం బ్రాండ్లపై తీవ్ర విమర‌్శలు వచ్చాయి. సెటైర్లు పేలాయి. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఏపీలో మద్యం ధరల్ని పెంచేశారు. 2019 మే నెలకు ముందు ఉన్న ధరలతో పోలిస్తే రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు చేశారు.
మద్యం బ్రాండ్ల మతలబు ఐదేళ్ల పాటు సాగింది. జనం కోరుకునే బ్రాండ్లను కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే బ్రాండ్లను మాత్రమే కొనాల్సిన పరిస్థితి కల్పించింది జగన్ సర్కార్. లిక్కర్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లో ఈ దందా నడిచింది. మద్యం విక్రయాలకు కేవలం నగదును మాత్రమే అనుమతించడం ద్వారా ఎప్పటికప్పుడు ముడుపులు నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేరి ఉంటాయని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది.
ఏపీలో 3 వేల కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ముడుపులన్నీ చివరకు ఒకే చోటకు చేరినట్టు ఆధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముడుపుల వ్యవహారంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.