ఏపీ లిక్కర్ స్కామ్ ప్రధాన కుట్రదారుల్లో ఒకరు, ఈ కేసులో A-4గా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్టయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో ఆయనపై అరెస్టు వారంట్ జారీ కోసం సిట్ అధికారులు శుక్రవారం విజయవాడ ACB కోర్టులో మెమో వేశారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాల్ని దానికి అనుబంధంగా సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయాధికారి ఆ మెమో రిటర్న్ చేయటంతో..వాటిని ఆఘమేఘాలపై సమర్పించారు.
మరోవైపు మిథున్ రెడ్డి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం సిట్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆయన విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు సిట్ ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయన ఎక్కడ ఉన్నా పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. పోలీసులకు లొంగిపోవడం తప్పితే మిథున్ రెడ్డికి మరో ఆప్షన్ లేదు. ఈ నేపథ్యంలోనే మిథున్‌రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరై..లొంగిపోతారనే ప్రచారం జరుగుతోంది.
గతంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇలాగే అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. తర్వాత పొరుగు రాష్ట్రాలకు పారిపోయారు. ఐనప్పటికీ కాకాణిని వెదికి కేరళలో అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి చాలా కాలంగా తప్పించుకుని తిరుగుతున్నారు. గతంలో కోర్టు ఆదేశాలతో ఒక్క సారి మాత్రం సిట్ ముందు హాజరయ్యారు. న్యాయపోరాటం పేరుతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డిని పోలీసులు పట్టుకుంటే..తర్వాత బిగ్‌బాస్ దగ్గరకు కేసు చేరుకునే అవకాశం ఉంది.











