విజయవాడ సిటీకి లులు మాల్ రానుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న గవర్నర్‌పేట-2 RTC డిపో స్థలంలో లులు మాల్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. లులు ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖపట్నం, విజయవాడల్లో మాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్లా కలిపి రూ.1,222 కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించింది. దీంతో విజయవాడలో ఆ సంస్థ మాల్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపుపై ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ – APIIC పరిశీలన చేసింది. చివరకు గవర్నర్‌పేట-2 డిపో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డిపో స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ APIIC ఎండీ అభిషిక్త్ కిశోర్ నుంచి RTC ఎండీ ద్వారకాతిరుమలరావుకు ఇటీవల లేఖ వచ్చింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తోంది. ఆ స్థలాన్ని లులు మాల్‌కు ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఆర్టీసీ ఎండీకి సూచన వచ్చినట్లు సమాచారం.
గవర్నర్‌పేట-2 డిపో సుమారు 5 ఎకరాల్లో ఉంది. ఇక్కడ గవర్నర్‌పేట-2తో పాటు, ఒకటో డిపోకి చెందిన బస్సులను ఉంచుతారు. 1, 2 డిపోల మేనేజర్ల కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడీ భూమి లులు మాల్ కోసం ఇస్తే, ప్రత్యామ్నాయంగా గొల్లపూడి సమీపంలో ఆర్టీసీకి 5 ఎకరాలు కేటాయించేలా ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆ భూమికి సంబంధించిన వివరాలను ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేసింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి -SIPVB సమావేశం గురువారం జరగగా, అందులో లులు ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే గవర్నర్‌పేట-2 స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థలంలోని కొంత భాగంలో గతంలో నగరపాలక సంస్థ ఐరన్ స్క్రాప్ మెటీరియల్‌తో రూపొందించిన బొమ్మలతో పార్క్ ఏర్పాటు చేసింది. దీనిని కూడా మాల్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ప్రస్తుత గవర్నర్‌పేట-2 డిపో ఉన్న ప్రదేశం..ఒకప్పటి విజయవాడ బస్టాండ్‌గా ఉండేది. అక్కడే విజయవాడ-1 డిపో ఉండేది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పండిట్ నెహ్రూ బస్టాండ్ నిర్మాణం చేపట్టారు. ఇది 1990లో ప్రారంభమైంది. విజయవాడ-1 డిపోని కూడా కొత్త బస్టాండ్ ఆవరణలోనే ఏర్పాటుచేశారు. దీంతో పాత బస్టాండ్ ఉన్న ప్రాంతాన్ని సిటీ బస్సుల కోసం..గవర్నర్‌పేట-2 డిపోగా పేరు మార్చారు.











