2024 ఎన్నికల దాకా ఆయన ఎవరో పెద్దగా జనానికి తెలియదనే చెప్పాలి. రాజదాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఉద్యమాలను తన భుజాన వేసుకున్నట్లుగా తిరిగిన ఆయన…. అమరావతి నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులే అని అంతా అనుకున్నారు. ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ఆయన… పలు టీవీ ఛానెళ్లకు డీబేట్లకు వెళ్లి…అమరావతి ఆవశ్యకత, అందుకు రైతులు చేసిన త్యాగం… తదితరాలను బాగానే ఎలివేట్ చేయగలిగారు. తన వాదనను బలంగా వినిపించే సత్తా కలిగిన విద్యావంతుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇంకేముంది… 2024 ఎన్నికల్లో ఏకంగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. కూటమి పార్టీల వైపు బలంగా వీచిన గాలిలో ఏకంా ఎమ్మెల్యే అయిపోయారు. ఆయన మరోవరో కాదు… ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యే దాకా ఓ రకంగా కనిపించిన కొలికపూడి… ఎమ్మెల్యే కాగానే వివాదాల్లో చిక్కుకునిపోయారు. తనదైన శైలి విచిత్ర వైఖరితో కేవలం ఏడంటే ఏడు నెలల్లోనే కొలికపూడి లెక్కలేనన్ని వివాదాల్లో కూరుకుపోయారు. ఇప్పటికే ఓ దఫా పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు పిలిపించి మరీ కొలికపూడికి క్లాస్ తీసుకున్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనీవాసరావు నేతృత్వంలోని సమన్వయ కమిటీ వద్దకు పంపి వివరణ ఇచ్చేలా చేశారు. తాజాగా కొలికపూడి ఈ దఫా ఏకంగా టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందు విచారణకు హాజరయ్యే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, పార్టీ పోలిట్ బ్యూరో సబ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణలతో కూడిన క్రమశిక్షణా కమిటీ ముందు సోమవారం విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కొలికపూడికి ఆదేశాలు వెళ్లాయి.
అయినా కొలికపూడి ఇంతగా ఎందుకు వివాదంలో చిక్కుకున్నారన్న విషయంలోకి వస్తే… కొలికపూడి దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. తిరువూరు ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో ఆయనకు అక్కడి నుంచే అవకాశం కల్పించారు. గతంలోనూ ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గంగానే తిరువూరు ఉన్నా.. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ ఉన్నా… నియోజకవర్గంలో ఏనాడూ కులాలకు సంబంధించిన గొడవలు జరగలేదు. దాదాపుగా పార్టీలోని అన్ని సామాజిక వర్గాలు సఖ్యతతోనే మెలిగాయి. కొలికపూడి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో కుల ఘర్షణలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలయింది… బీసీలను అగ్రవర్ణాల మీదకు కోలికపూడినే ఉసిగొల్పుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలను అంతగా పట్టించుకోని కొలికపూడి తన వైఖరిని మాత్రం మార్చుకోవడానికి ససేమిరా అంటున్నారని వినికిడి.
ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న కొలికపూడి ఎక్కడికెళ్లినా… ఏదో ఒక వివాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. బెల్ట్ షాపులను నిర్మూలిస్తామని చంద్రబాబు చెబుతూ ఉంటే… తన నియోజకవర్గంలో బెల్ట్ షాపు ఉందంటూ మీడియా ముందే హడావిడి చేసిన ఆయన తీరు కాంట్రవర్శీకి కేరాఫ్‌గా మారింది.. ఇక పార్టీ కార్యకర్తలపై ఇష్టారీతిన వ్యవహరించే కొలికపూడి…వారిని నోటికొచ్చినట్లుగా దూషిస్తారట. ఈ తీరే కొలికపూడిని ముద్దాయిగా నిలబెడుతోందని సమాచారం. నియోజకవర్గ పరిధిలోని ఏ కొండూరు మండలంలో అన్నాతమ్ముళ్ల పంచాయితీ తీర్చేందుకు వెళ్లిన కొలికపూడి… గిరిజనుడైన ఓ వ్యక్తి, అతడి బార్యపై దురుసుగా వ్యవహరించారు. దీంతో మనస్తాపం చెందిన సదరు మహిళ ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం అదిష్ఠానం దాకా వెళ్లగా… కొలికపూడికి తాజాగా నోటీసులు జారీ అయినట్లు సమాచారం.ఇకనైనా కొలికపూడి తన వైఖరి మార్చుకుంటారో, లేదంటే… క్రమశిక్షణా చర్యలకు బలైపోతారో చూడాలి.