ఇమేజ్ బాగున్నంత కాలం అంతా బాగానే ఉంటుంది. ప్రజల్లో మద్దతు ఉన్నంత కాలం తిరుగే ఉండదు. ఎప్పుడైతే ప్రజల్లో నాయకత్వం పట్ల అసంతృప్తి మొదలై తీవ్రమవుతుందో.. అప్పుడే ఆ నాయకత్వం డిఫెన్స్‌లో పడుతుంది. అప్పటి వరకు ప్రశ్నించడం కాదు గదా..కనీసం అభిప్రాయం చెప్పడానికి కూడా భయపడి అన్నిటికీ తలూపేవారు సైతం.. తలెగరేస్తారు. ఎదురు తిరుగుతారు. ధిక్కార ధోరణి ప్రదర్శిస్తారు. ఆ నాయకత్వాన్ని లెక్క చేయరు. అప్పుడే అనిపిస్తుంది ఆ నాయకత్వానికి తమ పని అయిపోయిందని. అయితే ఇద్దరు నాయకులకు ఒకేసారి అలాంటి అనుభవం ఎదురవడం.. అది కూడా ఒకరికొకరు ఆ బలహీనతను చూపించుకోవడమనేది అరుదైన విషయం.. ఆశ్చర్యకరమైన విషయం. వారిద్దరూ ఒకరు నరేంద్ర మోదీ.. మరొకరు యోగి ఆదిత్యానాథ్.
కనుసైగతో భారత దేశాన్ని శాసించే స్థాయికి..
నరేంద్ర మోదీ.. మొదట్లో ఆయనను వ్యతిరేకించినవారున్నారు. ప్రధాని అభ్యర్ధిగానే అంగీకరించలేదు. కాని అద్బుత విజయం అందుకున్నాక సిట్యుయేషన్ మారిపోయింది. వచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారు. ఆయనకు అమిత్ షా తోడయ్యారు. ఇద్దరూ కలిసి అటు పార్టీని..ఇటు ప్రభుత్వాన్ని నడిపించడమే కాదు..మొత్తం వ్యవస్ధలనే గుప్పిట్లో పెట్టుకున్న పరిస్ధితి కనపడుతుంది. కనుసైగతో భారత దేశాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. కాని ఆట అధికారం కోసమే ఆడితే…అది ఎల్లవేళలా విజయాన్నిఅందించదు. పైపై మెరుగులు కరిగిపోయి..భారతదేశం ఆర్ధిక సంక్షోభంలో పడిందన్నవిషయం బయటపడింది. కేవలం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని.. బలం పెరగడంతో.. సంక్షేమ పథకాలను, సంప్రదాయిక ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కకు తోసేశారు. ఇవన్నీ చాలక కోవిడ్ వచ్చింది. ఇక కరోనా అయితే మన వ్యవస్ధల్లోని లోపాలన్నిటిని బయట పెట్టింది. దీంతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.
తగ్గిన యోగి ప్రభ..
యోగి ఆదిత్యానాథ్. సంప్రదాయిక ఆర్ఎస్ఎస్ వాది. ఒక విధంగా చెప్పాలంటే హిందూత్వ తీవ్రవాది. యూపీలో బిజెపి ఘన విజయం సాధించిన వేళ.. యోగికి సీఎం పదవి దక్కింది. మొదట్లో చాలా దూకుడుగా వెళ్లారు యోగి. రౌడీలు, గూండాలపై ఉక్కుపాదం ఒక క్రేజ్‌ను తెచ్చింది. మోదీ తర్వాత ప్రధాని యోగీయే అనే ప్రచారం కూడా మొదలైంది. కాని తర్వాత కాలంలో యూపీలో అత్యాచారాలు పెరిగిపోయాయి. శాంతిభద్రతలు అదుపు తప్పాయి. కేవలం అగ్రవర్ణాలకే చట్టం…బలహీన వర్గాలకు అణచివేతే అన్నట్లు తయారైంది. కోవిడ్ పరిస్ధితులను కూడా డీల్ చేయలేక పోయారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో యోగి ప్రభ తగ్గింది. ఎంతలా అంటే..ఆయనను మార్చేయాలనేంతగా.
ఇద్దరికీ మొదటి నుంచి పడదంట..
నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యానాథ్ ఇద్దరికీ మొదటి నుంచి పడదంట. యూపీ సీఎంగా యోగిని పెట్టడానికి మోదీ అంగీకరించలేదు. కాని ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో తప్పలేదు. ఇప్పుడు కూడా యోగిని మార్చాలనే మోదీ ప్రతిపాదనలకు… మోదీ వైఫల్యాలనే కౌంటర్‌గా వినిపిస్తున్నారంట యోగి. వచ్చే ఏడాది జరగబోయే యూపీ ఎన్నికల్లో ఓడిపోతే …ఇక బిజెపికి కష్టాలే..అందుకే యోగిని మార్చాలని మోదీ ఆర్ఎస్ఎస్ ముందు వాదించారంట. కాని చివరి రోజుల్లో మారిస్తే అది వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని కొందరు వాదిస్తున్నారంట. మరోవైపు యోగి సైతం.. మరి నరేంద్ర మోదీని కూడా మారుస్తారా అని అడుగుతున్నారంట. దీంతో పంచాయతీ ఆర్ఎస్‌ఎస్ దగ్గరకే చేరింది. ఇప్పుడు వాళ్లు ఫైనల్‌గా ఏది చెబితే అదే ఫైనల్. వారికైతే యోగిని మార్చడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలను సైతం లెక్క చేయని మోదీ… ఇప్పుడు యోగి విషయంలో వారినే ఆశ్రయించాల్సి వచ్చింది. టైమ్ బాగోకపోతే అంతే మరి.











