చిలకలూరిపేట రాజకీయాలు ఇప్పుడు హాట్‌హాట్‌గా మారాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత విడుదల రజిని..సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుల మధ్య డైలాగ్‌వార్ నడుస్తోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటలతూటాలు పేలుతున్నాయి. ఇటీవల విడుదల రజిని చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పుల్లారావు. ఒక రకంగా విడుదల రజినీకి చివరి వార్నింగ్ ఇచ్చారు పుల్లారావు.
వైసీపీ హయాంలో చేసిన అరాచకాలన్ని బయటకు తీసి..తిన్నదంతా కక్కిస్తామంటూ విడుదల రజినీకి వార్నింగ్ ఇచ్చారు ప్రత్తిపాటి. చిలుకలూరిపేటలో అరాచకాలు చేసి..ఇప్పుడు గుంటూరు పారిపోయారని పుల్లారావు విమర్శించారు. అక్కడ కూడా ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో రజిని మరోసారి చిలకలూరి పేటకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు.
చిలకలూరిపేటలో తన అనుచరులతో రజిని లెక్కకుమిక్కిలి అవినీతి పనులు చేసిందని,తర్వాత గుంటూరుకు పారిపోయిందన్నారు. ఈ విషయాలన్ని అప్పుడే మరిచిపోతే ఎలా అంటూ రజినీని ప్రశ్నించారు ప్రత్తిపాటి. ఓటేసిన ప్రజలతో పాటు చిలకలూరిపేటను పూర్తిగా నాశనం చేసిందంటూ మండిపడ్డారు. తాను ఏ తప్పూ చేయలేదని, దేనికైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు ప్రత్తిపాటి. 7 నెలలు ఎక్కడ దాక్కున్నావంటూ రజినీని నిలదీశారు. త్వరలోనే తిన్నదంతా కక్కిస్తానంటూ ప్రత్తిపాటి వార్నింగ్ ఇచ్చారు.
దమ్ముంటే..ఈ ఐదేళ్లు పురుషోత్తమపట్నంలోనే ఉండాలంటూ రజినీకి ఛాలెంజ్ చేశారు ప్రత్తిపాటి. వైసీపీ హయాంలో జగన్, సజ్జల అండ చూసుకుని రజినీ విపరీతమైన అరాచకాలు చేసిందన్నారు ప్రత్తిపాటి. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రజినీని విడిచిపెట్టే అవకాశమే లేదన్నారు.
నిజానికి విడుదల రజినిని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది పుల్లారావే. అంటే ఓ రకంగా ఆమెకు పుల్లారావు రాజకీయంగా గురువు. మహానాడు వేదికగా మాట్లాడే అవకాశం కూడా కల్పించారు. ఆ వేదిక మీద రజిని తన వ్యాఖ్యలతో చప్పట్లు కొట్టించారు. జగన్‌ను రాక్షసుడంటూ మండిపడ్డారు. ఆ స్పీడ్‌తో రజినీకి ఫుల్ క్రేజ్ వచ్చింది. తర్వాత వైసీపీ నుంచి ఆఫర్ రావడంతో ఒక్కసారిగా జంప్ కొట్టి చిలకలూరిపేట నుంచి పోటీ చేశారు. తర్వాత గడిచిన ఐదేళ్లు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. చివరకు చిలకలూరిపేటలో డిపాజిట్లు గల్లంతవుతాయని ముందే అర్థం కావడంతో గుంటూరుకు మకాం మార్చారు. కానీ అక్కడ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో మళ్లీ చిలకలూరిపేటకే వచ్చి స్థిరపడ్డారు.