తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , మాజీ మంత్రి ఎల్. రమణ హైద్రాబాద్ , రంగారెడ్డి , మహబూబ్ నగర్ ఉమ్మడి పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రమణ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని, ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కేసీఆర్ నాయకత్వంలో కాదని తీవ్ర విమర్శలు చేసారు ఎల్. రమణ.
చంద్రబాబు ఎనలేని కృషే కారణం
హైద్రాబాద్ , రంగారెడ్డి జిల్లాలు ఇప్పుడు అభివృద్ధిలో అగ్రపథాన ఉన్నాయంటే దానికి చంద్రబాబు నాయుడు చేసిన ఎనలేని కృషి కారణమని , అలాగే ఐటీ రంగంతో పాటుగా ఉద్యోగులు , నిరుద్యోగులు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అండగా ఉన్నారని , తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఖతమైపోయిందని వాగుతున్న వాళ్లకు ఈ ఎం ఎల్ సీ ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. హైద్రాబాద్ , రంగారెడ్డి , మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఎల్. రమణ.
కష్టసమయాల్లో పార్టీకి వెన్నుదన్నుగా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసారు ఎల్. రమణ. తెలుగుదేశం పార్టీకి , అధినేత నారా చంద్రబాబు నాయుడికి విధేయుడిగా ఉండి పార్టీ కష్టసమయాల్లో ఉన్నప్పటికీ పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి ఎల్. రమణ. పదవుల కోసం పార్టీలు యథేచ్ఛగా మారుతున్న ఈరోజుల్లో కూడా అధినేత చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచిన నిస్వార్ధపరుడు రమణ. తెలంగాణ రాష్ట్రం సిద్దించాక పలువురు నాయకులు పార్టీని వీడినప్పటికి మొక్కవోని ధైర్యంతో పార్టీలోనే కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో ఎల్. రమణ నేతృత్వంలోనే తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 15 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది తెలంగాణలో. ఇక ఎం ఎల్ సీ ఎన్నికల విషయానికి వస్తే ……. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వాళ్ళ మద్దతుతో తప్పకుండా ఎం ఎల్ సీ ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని జోరుగా సాగిస్తూ ఎల్. రమణ దూసుకుపోతున్నారు.