కొంత మందికి చదువుకోవాలనే కోరిక ఉంటుంది. తమకున్న బరువు, బాధ్యతల కారణంగా సమయం ఉండటంలేదని, అవకాశం దొరకడం లేదని చదువును పక్కన పెట్టేస్తారు కొందరు. మరికొంత మంది ఉన్న సమయాన్నేసద్వినియోగం చేసుకుంటూ తమ లక్ష్యాలను చేరుకుంటారు. సరిగ్గా అలాంటి కోవకు చెందిన వారే తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి.
తెలంగాణ రాష్ట్రానికి ఆయన పోలీస్ బాస్. ఎన్నో బాధ్యతలు, సవాళ్లు తన విధి నిర్వహణలో ఎదుర్కొనవలసి వస్తుంది. కుటుంబంతో గడపడానికే ఒక్కోసారి సమయం దొరకదు. అలా అని తన గోల్‌ను ఎప్పుడు పక్కన పెట్టేయలేదు. అనుకున్నది సాధించి తన కలను నెరవేర్చుకున్నారు. ‘ ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలీసింగ్’ అనే సబ్జెక్టు మీద డీజీపీ మహేందర్‌రెడ్డి పీహెచ్‌డీ పూర్తి చేశారు. శుక్రవారం జెన్‌టీయూ స్నాతకోత్సవంలో తన పీహెచ్‌డీ పట్టాను ఆయన అందుకున్నారు.
పదేళ్లుగా అధ్యయనం…
రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కార్యక్రమానికి అధ్యక్ష ఉపన్యాసం చేయగా, డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీశ్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై డీజీపీకి పీహెచ్‌డీ పట్టాను అందజేశారు. పోలీసింగ్, సమాజ భద్రతలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(సమాచార సాంకేతికత) వినియోగంపై తాను గత 10 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై చేసిన తన పరిశోధన పోలీసు డిపార్ట్‌మెంట్ వారికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పీహెచ్‌డీ పూర్తి చేయడంలో తనకు సహకరించిన గైడ్స్, ఇతరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నేరాలను అదుపు చేయడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడకం బాగా పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఎన్నోకేసులను చేధిస్తున్నారు. ఎంతో కష్ట తరమైన కొన్ని కేసులు కూడా కేవలం కొన్ని గంటల్లోనే చేధిస్తున్నారు. అలాగే డీజీపీ చేసిన పీహెచ్‌డీ అంశం కూడా పోలీసులకు మరింత ఉపయోగపడుతుందని అంటున్నారు.











