ఏపీలో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య త్వరలోనే 12కు చేరనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని త్వరలోనే అరెస్టు చేస్తారని తెలుస్తోంది. ఈ కేసులో 39వ నిందితుడిగా ఉన్న మోహిత్ తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టును కూడా కోరారు. ఐతే ఈ రెండు చోట్లా మోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో మోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు రంగంలోకి దిగారు.
మరోవైపు లిక్కర్ స్కాంలో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు సోమవారం మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు సిట్ నోటీసులు జారీ చేసినా మోహిత్ విచారణకు హాజరు కాలేదు. తాను ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నానని, వాటిపై తేలాక విచారణకు వస్తానంటూ వాయిదాలు వేశారు మోహిత్ రెడ్డి.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత మోహిత్ రెడ్డిలో అరెస్టు భయం మొదలైంది. ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. భాస్కర్ రెడ్డి, మోహిత్ తో పాటు మరో నలుగురిని కొత్తగా కేసులో నిందితులుగా చేర్చగా… వీరిలో ఇప్పటిదాకా భాస్కర్ రెడ్డి సహా ముగ్గురు నిందితులు అరెస్టు అయ్యారు. మోహిత్ తో పాటు ఇంకో నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు.
లండన్ ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అందులో మోహిత్ రెడ్డి డిస్టింక్షన్ పాసై గర్వంగా చంద్రగిరి చేరుకున్నారు. మోహిత్ చదువుకున్న రంగంలోనే ఆయన కొనసాగి ఉంటే…ఈ అరెస్టుల గోలే ఉండేది కాదు. అయితే జగన్ ఒక్కసారి సీఎం కాగానే భాస్కరరెడ్డి అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఉన్నత ఉద్యోగంలో కొనసాగాల్సిన తన కుమారుడిని రాజకీయాల్లోకి దింపారు. మొన్నటి ఎన్నికల్లో తన స్థానంలో మోహిత్‌ని నిలిపారు. భాస్కర్ రెడ్డితో పాటు మోహిత్ కూడా ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు మోహిత్ ఏకంగా జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.











