పంచ మకారాలు బాలీవుడ్ ను శాసిస్తున్నాయా? ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఔననే అనుకోవాల్సి వస్తోంది. మందు, మగువ, మాదకద్రవ్యం.. ముఖ్యంగా ఈ మూడు బాలీవుడ్ కు ప్రమాదకరంగా పరిణమించాయి. ఇవి ఒకదానికొకటి లింకుతో ఉన్న సంబంధాలే. దాంతో డ్రగ్స్ కేసు బాలీవుడ్ పునాదులను పెకలిస్తోంది. ఎన్సీపీ ఈ విషయంలో చురుకుగా కదులుతోంది. ఈ లిస్టులో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. కనీసం రోజుకో కొత్త పెరు తెరపైకి వస్తోంది.
ఈరోజు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ ను విచారించేందుకు ఎన్సీబీ అధికారులు తలోజా జైలుకు వెళ్లారు. విచారణ కోసం సమన్లు అందుకున్న సారా అలీఖాన్ గోవా విమానాశ్రయం నుంచి ముంబయికి బయలుదేరింది. ఈ నెల ఆమె ఎన్సీబీ ముందు హాజరు కావలసి ఉంది. ఆమె తన తల్లితో కలిసి ముంబయికి బయలుదేరింది. దీపికా పదుకునే కూడా ఇదే పనిలో ఉంది. ఆమె కూడా తన తల్లి అమృతా సింగ్ తో కలిసి పయనమైంది. తనకు సమన్లు ఏమీ అందలేదంటూ బుకాయిస్తూ వచ్చిన రకుల్ కూడా ఇక ఆ మాట అనడానికి వీలు లేకుండాపోయింది.
అధికారులు ఆమెకు కూడా సమన్లు అందజేశారు. ఆమె ఈరోజే అధికారుల ముందు హాజరు కావాలనుకున్నాషూటింగ్ కారణంగా కుదరలేదు. రకుల్ కూడా శుక్రవారం విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రకుల్ తన న్యాయనిపుణులతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈకేసుకు సంబంధించిన విచారణ కోసం ఫ్యాషన్ డిజైనర్ ఖంబట్టాను కూడా ఎన్సీబీ పిలిపించింది. దీపికా పదుకునే వాట్సాప్ ఛాటింగ్ కూడా ఈ దర్యాప్తులో కీలకం కానుంది. ఆమె తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ తో జరిపిన ఛాటింగ్ వివరాలను తీసుకురావాలని కూడా ఆదేశించారు.
దీపిక శుక్రవారం విచారణకు హాజరుకావచ్చు. ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన నాయవాదుల సలహాలు తీసుకుంటోంది. సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ లు డ్రగ్స్ పెడ్ లర్ లతో సన్నిహితంగా ఉన్నారా అనే విషయాన్ని కూడా అధికారులు ఆరాతీస్తున్నారు. వారిలో అనుజ్ కేశ్వానీ డ్రగ్స్ పెడ్ లర్. అతను శ్రద్ధ, సారాలతో అనేక సార్లు సంప్రదింపులు జరిపాడు. వారికి వాటిని సరఫరా చేసినట్లు అంగీకరించాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ శ్రుతి మోడీ ఈరోజు ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు విచారణను ఆమె ఎదుర్కొంటోంది.
నగ్మా నోరు తెరవడం ఎందుకో?
నేలకు పోయి నెత్తికి రాసుకునే బ్యాచ్ కూడా సినిమా రంగంలో ఎక్కువే ఉన్నారు. ఏదో ఒకటి కెలికి వార్తలకెక్కడం, దాన్నుంచి బయటపడేందుకు తంటాలు పడటం పరిపాటిగా మారింది. ఈరోజు నటి నగ్మా వంతు వచ్చింది. అయితే నగ్మా అడిగిన పాయింట్ లో కూడా అర్థముంది. తాను గతంలో డ్రగ్స్ తీసుకునేదాన్నని కంగనా స్వయంగా ఇదివరకే వెల్లడించింది. కాబట్టి ఆమెకు సమన్లు ఎందుకు పంపడం లేదంటూ నగ్మా ప్రశ్నించింది. కాంగ్రెస్ నేతగా ఆమె ఈ ప్రశ్న అడిగినట్లుంది. ఎందుకంటే కంగనాకు అధికార పార్టీ అండదండలున్నాయనే అందరి భావన. ట్విట్టర్ లో నగ్మా ఏమందో చూద్దాం. ‘వాట్సాప్ ఛాటింగ్ ఆధారంగా అందరికీ సమన్లు పంపినప్పుడు స్వయంగా వెల్లడించిన కంగనకు ఎందుకు సమన్లు పంపలేదు? పెద్ద హీరోయిన్లకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్ చేసి వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే ఎన్సీబీ డ్యూటీయా?’ అని పేర్కొంది.











