MP Raghu Rama Raju Wrote Letter To Jagan :
సీఎం జగన్ కు మళ్లీ జైలు భయం పట్టుకుందా..? ఒకవేళ ఆయన జైలుకెళ్తే, ఆయన భార్య భారతిరెడ్డి సీఎం అవుతారా? అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే జగన్ తరచు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక అంశాలను మీడియా వెల్లడిస్తుండటం.. సీఎం జగన్ రెడ్డి మీడియాకు ముఖం చాటేయడం.. భారతిరెడ్డి అధికారిక కార్యక్రమాలకు హాజరవుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. అంతేకాదు.. ఏపీ, తెలంగాణపై నీళ్ల పంచాయితీపై సీఎస్ వివరణ ఇవ్వడం కూడా పలు విమర్శలకు దారితీస్తోంది. ఇదే విషయమై వైసీపీ రెబల్ ఎంపీ, సీఎం జగన్ కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. సీఎస్ రాజ్యాంగేతర శక్తి మారారని లేఖ లో ప్రస్తావించారు.
పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ…
ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న వ్యక్తి.. పార్టీ బాధ్యతలను ఎలా నిర్వహిస్తారని ఎంపీ రఘురామరాజు ప్రశ్నించారు. సజ్జల ఒక రాజ్యాంగేతర శక్తిగా మారిపోయారని, ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. సలహాదారుడిగా ఆయన ఏం చేయాలి? ఆయనకు ఉన్న బాధ్యతలు ఏంటి? అనే అంశాలు సజ్జల తెలుసుకోలేని పరిస్థితి లో ఉన్నారని మండిపడ్డారు. ఆయన తన ప్రాముఖ్యతను పెంచుకోవడానికి అధికారాన్ని అడ్డంపెట్టుకుంటున్నారని, ఇప్పటికే వైసీపీ నేతలకు కంటగింపుగా ఉందని రఘురామరాజు గుర్తుచేశారు.
వ్యవస్థను పరిహాసం చేయడమే
ఇటీవల ఓ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడితో పాటు నాలుగు జిల్లాలకు ఇన్ చార్జిగా ఉన్నానని సజ్జల ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం సీఎస్ కు పూర్తి అధికారం ఇవ్వాలనుకుంటే పెద్దల సభకు నామినేట్ చేయడమో, ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకోవాలని సూచించారు. ప్రభుత్వ సలహదారుడి హోదాలో ఉండి రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చడం సమంజసం కాదని ప్రస్తావించారు. ఇవన్నీ తెలిసి జగన్ ప్రభుత్వం సైలంట్ ఉందంటే.. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహాసం చేయడమేనని రఘురామరాజు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ ఉన్నారని, నీటి అంశంపై సజ్జలతో మాట్లాడించడం సబబు కాదని చురకలంటించారు. జగన్ ప్రభుత్వం ద్విపాత్రాభినయం చేయిస్తుంటే.. ఎవరో ఒకరు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం తో న్యాయస్థానాల గడప తొక్కవచ్చని.. జగన్ ఇమేజ్ కు భంగం కలుగవచ్చని ఎంపీ రఘురామరాజు ఘాటుగా ప్రస్తావించారు.