(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
భారతీయుల సాంస్కృతిక, వారసత్వ వైభోగానికి ప్రతీకైన భోగి పండుగను ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో వినూత్నంగా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ గ్రామంలో నెల రోజులుగా గ్రామవాసులంతా శ్రద్ధగా తయారు చేసిన లక్షా ఒక్క పిడకలను ఒక పిరమిడ్‌గా రూపొందించి భోగి మంట వేశారు. దీనికి జిల్లా కలెక్టర్ జె. నివాస్ ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటను వెలిగించారు.
చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి : కలెక్టర్
“పండుగ రోజుల్లో అందరూ కలసికట్టుగా సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉంది.. ఇక్కడి వాతావరణం చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి.. అంటూ ఈ సందర్భంగా కలెక్టరు జె.నివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. అత్యధికంగా 14,500 పిడకలు తయారు చేసిన గంటా నాగుకు ప్రథమం, రెండో బహుమతి ఎ.భాస్కరరావు, తృతీయ బహుమతి జి.గౌతమ్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
విజయనగరంలో ..
సాంస్కృతిక రాజధాని, కళలకు కాణాచి అయిన విజయనగరంలో భోగి వెలుగులు విరజిమ్మాయి. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తన కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్ని తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఈ ఏడాది గడపాలని ఆకాంక్షించారు.

చీరల పంపిణీ
విజయనగరం మండలం జమ్ము (6వ డివిజన్) లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పండగ సందర్భంగా పేదవారికి చీరలు , బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీటీడీ నాయకులు అదితి గజపతిరాజు, ఐవిపి రాజు, ప్రసాదుల లక్ష్మీ ప్రసాద్ , గంటా రవి, గంటా మోహన్ రావు, రౌతు నర్సింహమూర్తి, రౌతుపద్మ, పొగిరి పైడిరాజు, ఇతర వార్డు నేతలు పాల్గొన్నారు.











