పండుగ వస్తుందంటే చాలు అభిమానులంతా ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. సోషక్ల్ మీడియాపై ఒక లుక్కేసే తమ పనులు చేసుకుంటున్నారు. అంతగా వాళ్లలో ఉత్కంఠను రేకెత్తించే అంశం ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వస్తుందా అనే కుతూహలం వాళ్లను కుదురుగా ఉండనీయడం లేదు. ఇకపై ప్రతి పండుగకు ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే సర్ ప్రైజ్ ఉంటుందని రాజమౌళి టీమ్ చెప్పడమే ఇందుకు కారణం. మరి ఈ సంక్రాంతికి అలాంటి సర్ ప్రైజ్ ఏమైనా ఉండనుందా? అంటే, ఉండే అవకాశం లేకపోలేదు. స్పెషల్ టీజర్ కి మాత్రం ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది.
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా స్వాతంత్రోద్యమ నేపథ్యంలో సాగే కథ. బానిస బతుకుల నుంచి విముక్తిని పొందడానికి ఒక వైపు నుంచి అల్లూరి సీతారామరాజు .. మరో వైపు నుంచి కొమరం భీమ్ తాము ఎంచుకున్న విప్లవ మార్గంలో ఎలా ముందుకు సాగారు? అనే కథాకథనాలతో ఈ సినిమా నడుస్తుంది. అందువలన సందర్భానికి తగిన విధంగా ఉంటుందనే ఉద్దేశంతో, గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీన ఈ సినిమా నుంచి స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నాడని అంటున్నారు. ప్రధాన పాత్రలు .. వాటి స్వరూప స్వభావాలను ఈ టీజర్ ద్వారా ఆవిష్కరించనున్నట్టు చెప్పుకుంటున్నారు.
గతంలో చరణ్ వైపు నుంచి అల్లూరి సీతారామరాజు వీడియోను వదిలినప్పుడు, ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు. ఆ తరువాత ఎన్టీఆర్ వైపు నుంచి స్పెషల్ వీడియో వదిలినప్పుడు చరణ్ వాయిస్ ఇచ్చాడు. ఈ రెండు వీడియోలు కూడా ఈ సినిమాపై అనూహ్యమైన రీతిలో అంచనాలు పెంచాయి. ఇక ఈ సారి జనవరి 26వ తేదీన వదలనున్న టీజర్ కి, చిరంజీవి వాయిస్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక్క తెలుగు వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను మాత్రమే రిలీజ్ చేస్తారా? లేదంటే అన్ని భాషల్లోను అదే సమయంలో వదులుతారా? అనేది చూడాలి. ‘కేజీఎఫ్ చాఫ్టర్ 2’ టీజర్ ను మించి ‘ఆర్. ఆర్. ఆర్’ టీజర్ ఉండాలని మాత్రం అభిమానులు కోరుకుంటున్నారు.