విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆంధ్రుల అభిమాన కథానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితాన్ని తెలంగాణ ప్రభుత్వం స్కూల్ సిలబస్‌లో పాఠంగా చేర్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం కేసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయం భేష్ అంటూ మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. కేసిఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బాలకృష్ణ తప్ప ఎవరూ అభినందించలేదని మిగిలిన వారు గడ్డి తింటున్నారా? అంటూ మండిపడ్డారు.
ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా మహనీయుడు ఎన్టీఆర్ జీవితకథను విద్యార్థులకు బోధించాలని డిమాండ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ ఓ అడుగు ముందుకేసి 1995 ఆగస్ట్ లో జరిగిన వైస్రాయ్ ఘటనను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చంద్రబాబు వెంట నడిచి మంత్రి పదవి కూడా పొందారు. కానీ 25 సంవత్సరాల తరువాత ఆయన పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చారు.
ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి దింపడంలో అప్పటి సీఎం వ్యక్తిగత కార్యదర్శి జయప్రకాశ్ నారాయణకు కూడా భాగముందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వైస్రాయ్ హోటల్ లో జరగబోయే సమావేశానికి రమ్మంటూ అప్పట్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి తనకు పిలుపు వచ్చిందని ముత్తా తెలిపారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులను ఈ సమావేశంలో చర్చిస్తామని వారు చెప్పారని ముత్తా వెల్లడించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు తెలపాలనే ఉద్దేశంతో తాను ఆయన ఇంటికి వెళ్లానని చెప్పారు. ” అక్కడ వ్యక్తిగత కార్యదర్శి జయప్రకాశ్ నారాయణను కలిసి మొత్తం విషయాన్ని తెలిపాను. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు చెప్పాలని కోరాను. కానీ జయప్రకాశ్ నారాయణ దీనికి అంత ప్రాధాన్యం లేదని కొట్టేశారు. ఈ సంగతి ఎన్టీఆర్ కు తెలుసని నన్ను ఊరడించారు. ఉదయానికి ఈ సమస్య సమసిపోతుందని భరోసా ఇచ్చారు.
అయినా ఎన్టీఆర్ ను కలవాలని నేను ప్రయత్నించినా కుదరదంటూ సమావేశానికి త్వరగా వెళ్ళమని సూచించారు అంటూ ముత్తా చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఎన్టీఆర్ పదవి దిగిపోవడం, చంద్రబాబు గద్దెనెక్కడం జరిగిందని ఆ నాటి నుంచి ఈనాటి వరకు తాను ఆ విషయంలో బాధపడుతూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీని రద్దు చేయమని ఎన్టీఆర్ కు కూడా తప్పుడు సమాచారం ఇచ్చింది జయప్రకాశ్ నారాయణే అంటూ ముత్తా బాంబు పేల్చారు.
చంద్రబాబుకు జయప్రకాశ్ నారాయణ అంతటి సాయం చేసి ఉంటే తరువాతి కాలంలో ప్రాధాన్యత దక్కాలిగా? వైస్రాయ్ ఎపిసోడ్ గుర్తుకు తెచ్చుకొని బాధపడ్డ ముత్తా తన విమర్శలన్నీ జయప్రకాశ్ నారాయణపైనే చేయడం గమనార్హం. ఎన్టీఆర్ విషయంలో ఇంత బాధపడుతున్న ముత్తా గత 25 ఏళ్లలో ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.











