పాలనా రాజధానిగా విశాఖను ఎంపికచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు రానున్న కాలంలో విశాఖలో గత ప్రభుత్వాల హయాంలో ఆయా సంస్థలకు కేటాయించిన భూములను ఏదో ఒక కారణం చెప్పి వెనక్కి తీసుకోనుందా?.. అందులోనూ కొన్నింటికి ఇప్పటికే ఎంపిక చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా రామానాయుడు స్టూడియో భూములు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని వార్తలూ కలకలం రేపుతున్నాయి.
ఒక్కొక్కటిగా స్వాధీనం..
విశాఖను పాలనా రాజధానిగా ప్రకటనకు ముందే వైసీపీ పెద్దలు కొందరు విశాఖలో ప్రభుత్వ భూములపై కన్నేశారన్న ఆరోపణలున్నాయి. అంతేకాకుండా హెటిరో, అరబిందో లాంటి సంస్థలకు విశాఖ జిల్లా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భూములు కేటాయిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు.. విశాఖ నగరంలోని భూములపై కన్నేసింది. ఇప్పటికే కార్తీక వనం ప్రాజెక్టు విషయంలో పలు ఆరోపణలు వచ్చాయి. 33ఏళ్లకు లీజుకు ఇచ్చిన భూముల్లో పనులు పూర్తి చేయడంలో జాప్యం చేశారనే కారణం చూపుతూ వాటిని వెనక్కు తీసుకుని ఓ ప్రముఖ హోటల్ గ్రూపుకు కట్టబెట్టారు. ఇందులో తెరవెనుక భారీ ఒప్పందాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. కొన్నాళ్ల క్రితం విలువైన బే పార్కు విషయంలోనూ అదే జరిగింది. ఈ భూములను ఓ ప్రముఖ కంపెనీ పేరిట బదలాయింపు జరిగింది. ఇక్కడే సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ భూముల బదలాయింపు తరువాతే ఓ కంపెనీకి నక్కపల్లి సమీపంలో భారీగా భూకేటాయింపులు జరిగాయని చెబుతున్నారు. ఆ భూములు కేటాయించిన ప్రాంతం.. విశాఖపట్నానికి 80కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. రానున్న కాలంలో ఈ భూములకు ఎంత విలువ పెరుగుతుందో ఊహించాకే తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతోపాటుగా ఇప్పటికే ఓ రిసార్టును, ఓ ట్రస్టును స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి వీటి భూములను నేరుగా వేరేవారికి బదిలీ చేయకపోయినా సొంత శాఖకు బదిలీ చేసి తరువాత తమకు అనుకూలమైనవారికి బదిలీచేసే ప్రక్రియ జరుగుతోంది.
అప్పట్లో చర్చ ఇదీ..
ఇటీవలే కొవిడ్ సమయంలో కొందరు సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ ను కలిసి ఫిలిం స్టూడియోకు విశాఖ ప్రాంతంలో భూములు కేటాయించాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. ప్రపంచమంతా ఓవైపు కొవిడ్ తో ఇబ్బంది పడుతుంటే కనీస సాయం(అప్పటికి చేయలేదు) కూడా చేయకుండా తమ వ్యాపారాల కోసం భూములు అడగడం ఏంటనే విమర్శలు వచ్చాయి. అలాంటిది ఇప్పటికే విశాఖలో మొదలైన స్టూడియోను స్వాధీనం చేసుకునే దిశగా జరగుతున్న యత్నాలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలించాలనుకున్న సమయంలో అప్పటి సీఎం చెన్నారెడ్డి స్టూడియోలకు భూములు, పరిశ్రమకు చెందినవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తరువాత ఎన్టీఆర్ హయాంలో కార్యకలాపాలు ప్రారంభించకుంటే భూములు వెనక్కి ఇవ్వాలని పిలుపు ఇవ్వడంతో చాలా స్టూడియోలు ప్రారంభం అయ్యాయి. తరువాతి కాలంలో విశాఖ టూరిజం, పర్యాటక రంగాలను, సౌకర్యాలను మెరుగుపర్చాలన్న లక్ష్యంలో భాగంగా ప్రభుత్వాలు పలు కంపెనీలకు, ప్రాజెక్టులకు భూములు కేటాయించారు. అప్పటికే దగ్గుబాటి రామానాయుడుకి హైదరాబాద్ లో రెండు చోట్ల స్టూడియోలు ఉన్న నేపథ్యంలో విశాఖపట్నంలో 2001, 2006లో అప్పటి ప్రభుత్వాలు భూములు కేటాయించాయి. భీమిలి మండలం తిమ్మాపురం సర్వే నంబరు 337లో 34.44 ఎకరాల భూములను కేటాయించారు.
రామానాయుడు ఫ్యామిలీ ఏమంటోంది?
అప్పట్లో కొండ ప్రాంతంగా ఉండే భూములను చదును చయడం, ఘాట్ రోడ్ నిర్మించడం లాంటి పనులను రామానాయుడు చేపట్టారు. 2008నాటికి స్టూడియో నిర్మాణం పూర్తయింది. అప్పట్లో విశాఖపట్నంలో స్టూడియో నిర్మిచేందుకు చాలా మంది వెనుకంజ వేసిన సందర్భంలో రామానాయుడు ముందుకు వచ్చారు. రామానాయుడు స్టూడియో పూర్తయ్యాక షూటింగ్ లూ జరుగుతున్నాయి. అయితే సినీ పరిశ్రమలోని సంక్షోభం, ఇటీవల కొవిడ్ నేపథ్యంలోనూ షూటింగ్ లు తగ్గాయి. విశాఖలో జరిగే షూటింగ్‌లకు రామానాయుడు స్టూడియో ఒక్కటే పెద్ద దిక్కుగా మారింది. తాజాగా హాట్ కేక్ గా మారిన విశాఖపట్నం- భీమిలి బీచ్ రోడ్డులో ఉన్న రామానాయుడు స్టూడియోపై ప్రభుత్వం కన్ను పడిందని, ప్రతిపాదిత రాజధాని కార్యాలయాల కోసం స్టూడియోను ఇచ్చేయాలని రామానాయుడు కుటుంబసభ్యులను కొందరు కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ భూములను ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాలని, అదే సమయంలో భీమిలి నియోజకవర్గంలో మరోచోట ఎక్కువ భూమి ఇస్తామని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే తమ తండ్రి ఎంతో శ్రమించి, వ్యవప్రయాలసలకోర్చి స్టూడియోను నిర్మించారని చెప్పిన రామానాయుడు కుటుంబసభ్యులు స్టూడియోను వదులుకునేందుకు సిద్ధంగా లేమని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే తమ మాట వింటే ఓ రకంగా, వినకుంటే మరో రకంగా లాగేసే చర్యలు వరుసగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రామానాయుడు స్టూడియో విషయంలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.