టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె సన్నద్ధం అవుతున్నారు.. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పరిణామాల తర్వాత దాదాపు 110 మంది ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఈ చేదు వార్తని జీర్ణించుకోలేక అశువులు బాశారు. గుండె ఆగి మరణించారు. ఆ కుటుంబాలని పరామర్శించేందుకు భువనేశ్వరి స్వయంగా ఓదార్పు యాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నిజం గెలవాలి అనే పేరుని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల నుండి అందుతోన్న సమాచారం..
సుప్రీం కోర్టులో చంద్రబాబు నాయుడు వేసిన ఎల్‌ఎల్‌పీ.. క్వాష్ పిటీషన్‌పై విచారణ జరుగుతోంది.. శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.. ఈ కేసులో వాదనల అనంతరం తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు జగన్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ ప్రయోగించడానికి రెడీ అయిందనే కథనాలు వస్తున్నాయి.. అంటే, కేసు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందనే భావన టీడీపీ నేతలలో నెలకొంది..
ఈ తీర్పు ఫలితం ఎలా ఉన్నా… నారా భువనేశ్వరితో నిజం గెలవాలి కార్యక్రమాన్ని కొనసాగించాలని, చంద్రబాబు నాయుడి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోందట.. ఇప్పటికే గత 40 రోజులుగా ఆమె రాజకీయాలను అత్యంత సమీపం నుండి చూస్తున్నారు.. ఏకంగా తనను పరామర్శించడానికి, సంఘీభావం తెలపడానికి వస్తోన్న కార్యకర్తలు, నేతలపైనా ఆంక్షలు విధించింది జగన్ సర్కార్.. ఈ నిర్బంధ సంకెళ్లను చేధించడం, ప్రజలకు జగన్ సర్కార్ చేస్తున్న దమనకాండను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆమె యాత్ర సాగనుందని తెలుస్తోంది.
మరోవైపు, నారా లోకేష్ సైతం సంచలన నిర్ణయం తీసుకున్నారు.. తన పాదయాత్రను ప్రస్తుతానికి తిరిగి ప్రారంభించకూడదని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.. చంద్రబాబు నాయుడు విడుదల తర్వాతే తన యువగళం యాత్రను షురూ చేయాలని టీడీపీ హై కమాండ్ తీర్మానించింది.. అప్పటివరకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని లోకేష్‌కి సూచించింది.. మొత్తమ్మీద, జగన్ యాక్షన్‌కి కౌంటర్ రెడీ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు…