ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ హయాంలో.. నాటి, నేటి సీఎం నారా చంద్రబాబునాయుడి మార్గదర్శకత్వంలో పోలవరం పనులు పరుగులు పెట్టింది. ఇంకో ఐదేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండి ఉంటే… పోలవరం ఎప్పుడో పూర్తి అయ్యి ఉండేది కూడా. అయితే అనుకోని ఉపద్రవంలా 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించిన ప్రజలు వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ చేసిన డ్రామాకు పట్టం కట్టారు. పలితంగా పోలవరం ప్రాజెక్టు పనులకు గ్రహణం పట్టగా… రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కూడా ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో అభివృద్ధి అన్న మాటే కనిపించలేదు, వినిపించలేదు కూడా. సరే… జగన్ తీరు తెలుసుకున్న జనం…ఐదేళ్లు అలా గిర్రున తిరగ్గా… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు ఇచ్చారు. జనసేన, బీజేపీలతో కలిసి బరిలోకి దిగిన టీడీపీ కూటమికి జనం ఏకంగా 164 సీట్లను కట్టబెట్టారు. అటు కేంద్రంలోనూ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కారే తిరిగి అధికారం చేపట్టడంతో ఇప్పుడిప్పుడే పోలవరం పనులు ఊపందుకున్నాయి. ఇకపై మరింత వేగంగా పోలవరం పనులు సాగనున్నాయి. అందుకు దోహదం చేసే ఓ కీలక పరిణామం శనివారం చోటుచేసుకుంది
పోలవరం సహా కేంద్రం నిధులు ఇచ్చే ఏ జలవనరుల ప్రాజెక్టుకు అయినా… కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి. ఈ శాఖ నుంచే ఆయా ప్రాజెక్టులకు నిధులు మంజూరు అవుతుంటాయి. అదే సమయంలో ఆయా ప్రాజెక్టుల పనులను ఆ శాఖే ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ.. అవసరమైన మేర సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిర్దేశించిన సమయం మించిపోతే… పెరిగిన ఖర్చులకు అనుగుణంగా అదనపు నిధులను కూడా ఆ శాఖే అందజేస్తుంది. పోలవరం విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ పనుల కోసం ఈ శాఖ తరఫున ఓ సంప్రదింపుల కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి ఎంపీల్లో ఒకరిని చైర్మన్ గా, మరికొందరు ఎంపీలను కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఉంటారు. తాజాగా ఈ కమిటీలో సభ్యుడిగా టీడీపీ యువ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ ఎంపికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఏలూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహేశ్ ఘన విజయం సాధించారు.
పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ మరెవరో కాదు… సుదీర్ఘ కాలంగా టీడీపీలో కొనసాగుతూ పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా గుర్తింపు పొందిన బీసీ నాయకుడు, కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడే. చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేశ్… తన తండ్రి మాదిరే రాజకీయాల్లోకి రావాలని ఆశించారు. అంతేకాకుండా టీడీపీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న యనమల రామకృష్ణుడికి మహేశ్ స్వయానా అల్లుడు కూడా. అటు తండ్రి, ఇటు పిల్లనిచ్చిన మామ ప్రోత్సాహంతో నాన్ లోకల్ అయినా కూడా మొన్నటి ఎన్నికల్లో ఏలూరు ఎంపీ టికెట్ ను దక్కించుకున్న మహేశ్… అతి స్వల్ప కాలంలోనే నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. అటు జనసేన శ్రేణులతోనూ సఖ్యతగా మెలగిన మహేశ్… వైసీపీ అభ్యర్ధిపై దాదాపుగా 2 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎంపీగా గెలుపొందిన తొలిసారే ఆయన ఇంధన, సహజవాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.
తాజాగా మహేశ్ ను కేంద్ర జలశక్తి కమిటీ సభ్యుడిగా నియమిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన పనిచేయనున్న ఈ కమిటీలో ఏపీ నుంచి మహేశ్ ఒక్కరికే చోటు దక్కింది. ఈ కమిటీలో మహేశ్ సభ్యుడిగా ఉండటం వల్ల ఒక్క పోలవరం ప్రాజెక్టుకే కాకుండా యావత్తు రాష్ట్రంలోని అన్ని జలవనరుల ప్రాజెక్టులతో పాటుగా తాగునీటి పథకాలకు సంబంధించి ఎంతో మేలు జరగనుంది. ఏపీలో కూటమి సర్కారు అదికారం చేపట్టిన తర్వాత పోలవరానికి గానీ, రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్రం అడిగిన మేరకు నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. ఇక ఇప్పుడు కేంద్ర జలశక్తి సంప్రదింపుల కమిటీలో పుట్టా మహేశ్ సభ్యత్వంతో మరింత మేర నిధులు రావడం ఖాయమేనని చెప్పాలి ఈ లెక్కన ఈ ఐదేళ్లలోనే పోలవరం పనులు పూర్తి అయి ఏపీ రూపు రేఖలే మారిపోవడం కూడా తధ్యమేనని చెప్పక తప్పదు