తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలిలో ఆయా అంశాలపై తన అభిప్రాయాలను విస్పష్టంగానే చెప్పేస్తున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం, ఎమ్మెల్సీగా చట్టసభలో వ్యవహరించాల్సిన తీరుపై అనతి కాలంలోనే పట్టు సాధించిన లోకేశ్.. పార్టీ విపక్షంలోకి మారిన తర్వాత సిసలైన రాజకీయవేత్త ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నారు. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా మన నేతలకు పట్టడం లేదు కదా. కానీ అందుకు భిన్నంగా సందర్భానుసారంగా తనదైన స్పీడును చూపుతున్న లోకేశ్.. ఆయా అంశాలపై ఎప్పుడేం మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో.. ఇలా అన్నింటా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా మంగళవారం పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన లోకేశ్.. ముందుగా భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియా ప్రతినిధులతో మాట కలిపిన లోకేశ్.. దైవ దర్శనానికి వచ్చిన వేళ రాజకీయాల గురించి మాట్లాడే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు.
లోకేశ్ మార్కు స్టేట్ మెంట్
భద్రాచలంలో సీతారాములను దర్శించుకుని ఆలయం నుంచి బయటకు వచ్చిన నారా లోకేశ్ అక్కడే తన కోసం వేచి చూస్తున్న మీడియా ప్రతినిధులను పలకరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల నుంచి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు వినిపించగానే.. లోకేశ్ వేగంగా రియాక్ట్ అయ్యారు. ‘‘దైవదర్శనం చేసుకుని వచ్చాను..రాజకీయాలు మాట్లాడను’’ అంటూ తేల్చి చెప్పేశారు. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి మీడియా ప్రతినిధులే రెచ్చగొట్టి మరీ ఆలయాల పరిసరాల్లోనే నేతలతో రాజకీయాలు మాట్లాడిస్తారు. అయితే భద్రాద్రిలో మాత్రం మీడియా మిత్రులకు అలాంటి అవకాశమే ఇవ్వకుండా హుందాగా వ్యవహరించారు. రెండు ముక్కల్లో తన అభిప్రాయాన్ని చెప్పిన లోకేశ్.. మరోమారు మీడియా నుంచి రాజకీయాల ప్రస్తావన రాకుండా చూసుకున్నారు. రెండంటే రెండు ముక్కల్లో తన అభిప్రాయాన్ని చెప్పిన లోకేశ్.. మీడియా ప్రతినిధులకే మాట రాకుండా చేశారని చెప్పక తప్పదు.
ఏం కోరుకున్నారంటే..?
సరే.. మరి రాజకీయాల గురించి మాట్లాడకుంటే.. దేవుడిని ఏం కోరుకున్నారన్న విషయాన్ని అయినా చెప్పండి అంటూ మీడియా ప్రతినిధులు అడగ్గా.. దానికి లోకేశ్ సమాధానం ఇచ్చారు. ‘‘కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో..కరోనా కష్టాలు కడతేరాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలుగురాష్ట్రాలు సఖ్యతతో ఉండి పరస్పర ప్రయోజనాలు గౌరవించుకుని, ప్రగతిపథంలో సాగాలి“అని రాములోరిని ప్రార్థించినట్టు లోకేశ్ తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాలని సీతారామచంద్రమూర్తికి మొక్కుకున్నానన్నానని కూడా ఆయన చెప్పారు. ఏపీ, తెలంగాణల మధ్య భద్రాచలం కేంద్రంగా సమస్యగా ఉన్న 5 పంచాయతీల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి స్నేహితులనీ, వారు అనుకుంటే క్షణాల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని లోకేశ్ కుండబద్దలు కొట్టేశారు. మొత్తంగా దైవ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడేది లేదని తేల్చేసిన లోకేశ్.. ఆ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సుహృద్భావ వాతావరణం, ఇద్దరు సీఎంల మధ్య ఉన్న స్నేహాన్ని ప్రస్తావించిన లోకేశ్.. ఈ తరం రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు.
Must Read ;- లోకేశ్ తగ్గట్లేదు!.. మరేం చేయాలి?











