ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. తన మూడో దశ విలయాన్ని ప్రారంభించిందనే చెప్పాలి. ఇప్పటికే తొలి, రెండో దశల్లో తనదైన శైలిలో ప్రతాపం చూపిన కరోనా.. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. కోట్లాది మందిని ఆసుపత్రుల పాలు చేసింది. అన్ని దేశాల మాదిరిగానే భారత్ కూడా కరోనా ధాటికి విలవిల్లాడిందనే చెప్పాలి. తొలి వేవ్ లో మరణాలు ఎక్కువగా నమోదైతే.. రెండో వేవ్ లో కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరింది. అయితే కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గకుండానే.. అప్పుడే ఈ వైరస్ తన థర్డ్ వేవ్ ప్రభావాన్ని మొదలెట్టేసిందని చెప్పాలి. డెల్టా వేరియంట్ రూపంలో విరుచుకుపడబోతున్న థర్డ్ వేవ్ లో మరింత నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదన్న నిపుణుల హెచ్చరికలు నిజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి.
కేసులు పెరుగుతున్నాయి
కరోనా డెల్టా కేసుల నమోదు చాలా రోజుల క్రితమే మొదలైనా.. గడచిన రెండు రోజులుగా ఈ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. గురువారం నాడు దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల సంఖ్యే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరగడం మొదలైపోయింది. దేశంలో బుధవారం నాడు 42,982 కేసులు నమోదు కాగా.. గురువారం నాడు 44,643 కేసులు నమోదయ్యాయి. గురువారం 464 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 4,26,754కు చేరింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 582 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 83 కేసులు నమోదయ్యాయి. ఏపీలో గురువారం నాడు 2,145 కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ కొత్త కేసుల సంఖ్య 2 వేల దిగువకు చేరగా.. ఇప్పుడు మళ్లీ ఆ సంఖ్య 2 వేల ఎగువకు చేరింది. దీంతో డెల్టా వేరియంట్ రూపంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ 3 వారాలే కీలకం
ఇదిలా ఉంటే..ఫస్ట్, సెకండ్ వేవ్ ల కంటే కూడా థర్డ్ వేవ్ లో మరింత మేర ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అక్టోబర్ వరకూ ఈ ముప్పు పొంచి ఉన్నా.. వచ్చే మూడు వారాల పాటు తగినంత మేర జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ ముప్పు నుంచి బయటపడినట్టేనని కూడా వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయిన నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఇకపై ఎక్కడ ఎక్కువ కేసులు నమోదైనా ఆయా ప్రాంతాల్లో తక్షణమే లాన్ డౌన్ విధించాలని కూడా ఆయా జిల్లాల యంత్రాంగానికి జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. జిల్లా పరిస్థితి ఎలా ఉన్నా జంట నగరాల్లో మాత్రం థర్డ్ వేవ్ మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పాతబస్తీలోని చాలా ప్రాంతాలను కరోనా హాట్ స్పాట్ లుగా తెలంగాణ సర్కారు ప్రకటించింది. థర్డ్ వేవ్ ను ఆదిలోనే అరికట్టే చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Must Read ;- కేసీఆర్ ప్రాణం పోస్తుంటే.. జగన్ భరోసా ఇవ్వలేకున్నారే