ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బుధవారం ఉదయం ఆయన పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి.. అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించడంతో పాటు ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కావాల్సి ఉంది. అయితే ఏమైందో తెలియదు గానీ.. జగన్ ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ టూర్ రద్దు కావడానికి గల కారణాలను మాత్రం సీఎంఓ ఆ ప్రకటనలో వెల్లడించలేదు.
టూర్ రద్దుకు కారణం చెప్పలేదే
సాధారణంగా సీఎం స్థాయి నేతల పర్యటనలు, వాటి రద్దుకు గల కారణాలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం వెల్లడిస్తూనే ఉంటుంది. ఎందుకంటే.. సీఎం పర్యటన అంటే.. భారీ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఆయా విభాగాలకు చెందిన అధికారుల సమాయత్తం.. తదితరాలన్నీ ఓ రోజు ముందుగానే పూర్తి అవుతాయి. వీటన్నింటినీ అప్పటికప్పుడు రద్దు చేయాలంటే సరైన కారణాలు చూపించాలి. ఈ పర్యటనలు రద్దు అయితే లక్షలాది ప్రజాధనం వృథా అవుతుంది కదా.. అందుకే ఆ విషయంలో విమర్శలు రాకుండా.. సహేతుక కారణాలను చూపుతూ పర్యటనలు రద్దు అవుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పర్యటనలు రద్దు అయ్యాయని ప్రజలకు చెప్పాలి. అయితే ఎందుకనో గానీ.. జగన్ సర్కారు సీఎం పర్యటన రద్దుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
నిర్వాసితులకు జగన్ భయపడినట్టేగా
అయినా పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాక.. జగన్ తన టూర్‌ను ఎందుకు రద్దు చేసుకున్నారన్న విషయంపై ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులు ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమకు పునరావాసం పూర్తి కాకుండా ప్రాజెక్టు పనులను చేపట్టారని, అయినా పునరావాసం కోసం సాధ్యమైనంత కాలం వేచి చూశామని, ఇప్పుడు వర్షాలు మొదలైన నేపథ్యంలో తాము ఉంటున్న ప్రాంతాలు ముంపునకు గురి అయ్యాయని, తమకు తక్షణమే మెరుగైన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు అధికార పార్టీ నేతలతో పాటు మంత్రి అనిల్ కుమార్ కు చుక్కలు చూపించారు. బుధవారం నాటి జగన్ పర్యటన సందర్భంగానూ తమదైన శైలి నిరసన తెలపాలని కూడా వారు నిర్ణయించుకున్నారట. ఈ విషయం తెలిసిన నేపథ్యంలో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే.. నిర్వాసితులకు భయపడిపోయిన జగన్ తన టూర్ ను రద్దు చేసుకున్నారన్న మాట,
Must Read ;- జగన్ ప్రాజెక్టుకు ఏపీలోనూ వ్యతిరేకతే!