ఏపీలో అధికార, విపక్షాల మధ్య కొనసాగుతున్న రాజకీయ పోరు మరింత మేర ఉధృతం కానుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యేగా గెలిచిన కూన,, మొన్నటి 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాం చేతిలోనూ కూన ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో కూనతో పాటు అదే జిల్లాకు చెందిన టెక్కలి ఎమ్మెల్యే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులు.. స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా అసెంబ్లీ వారిద్దరిపై అభియోగాలు మోపింది. దీనిపై స్పీకర్ ఆదేశాల మేరకు ప్రివిలేజ్ కమిటీ విచారణ కూడా జరుపుతున్న విషయం తెలిసిందే.
రెండో విచారణకు డుమ్మా
నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలోని సభా హక్కుల కమిటీ (ప్రివిలేజ్ కమిటీ) ఈ వ్యవహారంపై విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఓ దఫా కమిటీ సమావేశం కాగా.. కమిటీ విచారణకు అటు అచ్చెన్న గానీ, ఇటు కూన గానీ హాజరు కాలేదు. తొలి సమావేశమే కదా అన్న భావనతో కనీసం రెండో దఫా విచారణకైనా హాజరు కావాలంటూ వీరిద్దరికి కమిటీ నుంచి నోటీసులు అందాయి. అదే క్రమంలో మంగళవారం నాడు కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి అంటే.. రెండో దఫా విచారణకు కూడా అచ్చెన్నతో పాటు కూన కూడా హాజరు కాలేదు. అయితే తాను ఈ విచారణకు హాజరుకాలేనంటూ అచ్చెన్న ముందస్తుగానే సమాచారం ఇవ్వగా.. కూన మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విచారణకు డుమ్మా కొట్టారు.
చర్యలేమిటో..?
సాధారణంగా సభలో సభ్యులై (సిట్టింగ్ ఎమ్మెల్యేలు) అయి ఉండి.. సభా హక్కులకు ఉల్లంఘిస్తే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తారు. టీడీపీ హయాంలో సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సభా హక్కులను ఉల్లంఘించడంతో పాటుగా ప్రివిలేజ్ కమిటీనే కూన రవికుమార్ ధిక్కరించారు. రెండో దఫా విచారణకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైన కూన.. ధిక్కరణకు పాల్పడ్డారని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి తేల్చేశారు. ధిక్కరణకు పాల్పడ్డ కూనపై చర్యలు తీసుకోవాల్సిందేనని తీర్మానించారు కూడా. అయితే ఇప్పుడు సభలో సభ్యుడు కాని కూనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న అంశంపై ఆసక్తికర చర్చకు తెర లేసింది.
Must Read ;- వైసీపీ పనిని టీడీపీ భుజానేసుకుంది










