The YCP Government Has Launched A Indirect Attack On Nara Lokesh :
నిజమే.. బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. జగన్ సర్కారు అపసవ్య విధానాలపై తనదైన శైలిలో పోరాటం సాగిస్తున్నారు. రాష్ట్రంలో వరుసబెట్టి మహిలలు, బాలికలపై చోటుచేసుకుంటున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యాచారాలు, హత్యలపై సర్కారు చేతగాని తనాన్ని ప్రశ్నిస్తూ లోకేశ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నోట వెంట వైసీపీ సర్కారుపైనా, వైసీపీ నేతల తీరుపైనా తనదైన శైలి పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా ఆయన కట్టుదాటి ప్రవర్తించడం లేదు. ఓ పరిణతి కలిగిన రాజకీయనేతగా లోకేశ్ చేస్తున్న పోరాటానికి జనం నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. వెరసి జగన్ సర్కారు పెద్దలకు తడిసిపోతోందన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎంతగా భయపెట్టాలని చూసినా.. లోకేశ్ తగ్గడం లేదు. డైరెక్ట్ గా వెళితే పని కానప్పుడు దొడ్డిదారే శరణం అన్నట్లుగా ఇప్పుడు లోకేశ్ పై పోలీసు అధికారుల సంఘాన్ని జగన్ సర్కారు ఉసిగొల్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అదురు లేదు.. బెదురు లేదు..
జగన్ సర్కారు దుర్మార్గాలపై ఆది నుంచి కూడా తనదైన శైలిలోనే పోరు సాగిస్తున్న లోకేశ్.. మొన్నామధ్య కర్నూలు జిల్లా పెసరవాయిలో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలను వైసీపీ వర్గీయులు హత్య చేశారు. ఈ ఘటన లోకేశ్ ను కలచివేసిందనే చెప్పాలి. ఈ ఘటనపై తనదైన శైలిలో స్పందించిన లోకేశ్.. ఘటన వాస్తవాలను వెలికితీసేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే జగన్ సర్కారులో చలనమే లేకుండాపోయింది. తాజాగా మొన్న గుంటూరు నగరంలో పట్టపగలు ఉన్మాది దాడిలో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య ఘటనపై లోకేశ్ చాలా వేగంగా స్పందించారు. రమ్య మృతదేహానికి నివాళి అర్పించేందుకు వెళ్లిన లోకేశ్ ను వైసీపీ శ్రేణులు, పోలీసుల మందతో భయపెట్టాలని జగన్ సర్కారు యత్నించింది. అయితే లోకేశ్ ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా.. ఏకంగా ఆయనను అరెస్ట్ చేయించింది. అయినా కూడా లోకేశ్ లో అదురూబెదురూ కనిపించలేదు. పైగా 21 రోజుల్లోగా రమ్య హంతకుడికి శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వానికి లోకేశ్ డెడ్ లైన్ పెట్టారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఏడాది క్రితం జరిగిన హజీరాబీ అత్యాచారం ఘటనపైనా జగన్ సర్కారుకు లోకేశ్ మరో కీలకమైన సవాల్ విసిరారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఆ బాలికపై కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డ వైనంపైనా లోకేశ్ వేగంగా స్పందించారు.
ఇన్ డైరెక్ట్ గా దాడి షురూ
ఇలా నారా లోకేశ్ ఏ ఒక్క అంశాన్ని వదలకుండా.. జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. తనను బెదరగొట్టేందుకు చేస్తున్న యత్నాలను తుత్తునీయలు చేస్తున్నారు. మరి డైరెక్ట్ గా వెళితే పని కానప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఇన్ డైరెక్ట్ యత్నాలు షురూ చేస్తారు. ఇతర రంగాల విషయంలో ఏమో గానీ.. రాజకీయాల్లో మాత్రం ఈ తరహా ఎత్తులు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు జగన్ సర్కారు కూడా ఇదే మంత్రాన్ని ఎంచుకుని తమకు అదరని, బెదరని లోకేశ్ పైకి పోలీసు అధికారుల సంఘాన్ని ఉసిగొల్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో బాలికపై కానిస్టేబుల్ అత్యాచార యత్నం ఘటనలో జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఇప్పటికే నిందితుడిని సస్పెండ్ చేశారు. అంటే.. నిందితుడు ఇంకా నిర్దోషి అని తేలనట్లే కదా. ఇదే విషయాన్ని లోకేశ్ చెబితే.. ఓ వైపు ఎస్పీ హోదాలోని హఫీజ్ మీడియా ముందుకు వచ్చిన లోకేశ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెబితే.. మరోవైపు ఏ పాపం ఎరుగని కానిస్టేబుల్ పై అభాండాలు వేస్తారా? అంటూ పోలీసు అధికారుల సంఘం ఇప్పుడు లోకేశ్ పై కస్సుమంటోంది. ఈ మేరకు మీడియా సమావేశం పెట్టి మరీ ఈ వ్యవహారంలో లోకేశ్ క్షమాపణలు చెప్పాలని, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంటే.. లోకేశ్ పై ఇన్ డైరెక్ట్ దాడి మొదలైపోయినట్టే కదా.











