17 నిమిషాల సినిమాకి ట్రైలర్ ఎందుకు అనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అసలు ఇలా ట్రైలర్ వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. ఎన్టీఆర్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రాన్ని బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించారు. ఇంత చిన్న సినిమాకి అతి పెద్ద పబ్లిసిటీ వచ్చేసింది. ఇప్పుడు ట్రైలర్ కూడా విడుదలవడంతో ఓసారి చూసేద్దామన్న అభిప్రాయనికి జనం వచ్చారు. పైగా యాభై రూపాయలు పెద్ద మొత్తం ఏమీ కాదు. ట్రైలర్ కట్ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే సన్నివేశాన్ని ట్రైలర్ లో చూపారు. ‘ఈ అజ్ఞాతవాసం విజయవంతంగా ముగియవలెనన్న నాపైనే ఎక్కువ భారం ఉన్నది’ అని అర్జునుడి పాత్రధారి బాలయ్య చెప్పే డైలాగ్ తోనే ట్రైలర్ ప్రారంభమైంది. ద్రౌపది పాత్రధారి సౌందర్య ‘పాండురాజు తనయులకు లేని కష్టం.. నాకా?’ అంటుంది. ఇక భీముడిగా నటించిన శ్రీహరి ‘రాచబిడ్డ నై పుట్టినందుకు ఆవేశం సగభాగం.. మీకు తమ్ముడిగా పుట్టినందుకు శాతం సగపాలు వచ్చినవి’ అంటాడు. ‘ఆనాడు ఊర్వశి ఇచ్చిన శాపం ఈనాడు నాపాలిట వరమైనది.
ఇక మన దాయాదులు ఎంతమంది వేగులను పంపిననూ వాళ్ళ పాచికలు పారవు.. ఎత్తుగడలు సాగవు’ అని అర్జునుడు చెప్పగా ట్రైలర్ కట్ చేశారు. దాదాపు నటులంతా ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. అప్పట్లో డిజిటల్ ప్రక్రియ లేదు. ఫిలింలోనే తెరకెక్కించారు. డిజిటల్ క్వాలిటీకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. సౌందర్య, శ్రీహరి పాత్రలకు వేరేవారితో డబ్బింగ్ చెప్పించారు. అయినా ఆ లోటు కనిపించలేదు. శ్రీహరి విషయంలో కొంచెం తేడా కనిపించింది. మొత్తం మీద ఈ ట్రైలర్ సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చింది.











