వైసీపీ ప్రభుత్వం అమరావతిపై విషం చిమ్ముతూనే ఉంది. ఇప్పటికే మూడు రాజధానుల పేరిట కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉన్న అమరావతిని అలా కూడా ఉండేందుకు వీల్లేదని భావిస్తోంది. రాష్ట్ర మంత్రి హోదాలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండదేమో అనిపించకమానదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూడా మనసు రాని చోట శాసన రాజధాని కూడా ఉండడానికి వీలులేదని కొడాలి నాని గత కొన్ని రోజులుగా వాదిస్తూనే ఉన్నారు. అమరావతి ప్రాంతలోని వారి ఆలోచనలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని అందుకే ఇక్కడ శాసన రాజధాని ఉండకూడదని నాని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇతర వర్గాల వారు, పేదలు అడుగు పెట్టకూడదు, తాము మాత్రమే ఉండాలన్న ఆలోచన ఉన్న చోటు నుంచి రాజధానిని తరలించాల్సిందిగా సీఎంని కోరతానని కొడాలి నాని కొన్ని రోజుల క్రితం ప్రకటన చేశారు. చెప్పినట్లు గానే నాని సీఎం జగన్ ను కలిసి అమరావతి ప్రాంత వాసుల ఆలోచనలను తెలియచేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూడా వారు ఒప్పుకోవడం లేదని నాని ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని నాని సీఎంకు సూచించారు. 55 వేల మందికి భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైతే అమరావతి దానిపై కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చుకోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం జగన్ అందరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని అన్నారని నాని ఆ ప్రకటనలో తెలిపారు.
నాని చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ఇది ప్రభుత్వ ఆలోచనా లేకా నాని ఆలోచనా అనే చర్చ జరుగుతోంది. సీపీఐ నేత రామకృష్ణ సీఎం జగన్ ఆలోచననే మంత్రి బయట పెట్టారంటూ విమర్శలు చేశారు. మంచి ఆశయంతో రైతులు ఇచ్చిన భూముల ప్రాంతాలను నిర్వీర్యం చేసేందుకు జగన్ సర్కార్ ఆలోచనగా ఉందని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట ఇప్పటికే శాసన రాజధానిగా మాత్రమే పరిమితం చేసిన అమరావతిపై మంత్రి వ్యాఖ్యలు దారుణమని అన్నారు. అమరావతిలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని నాశనం చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.