ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ ప్రసంగానికి నెటిజన్స్ నుంచి ఊహించని ప్రతికూల స్పందన వచ్చింది. నెటిజన్స్ స్పందన తీవ్ర స్థాయిలో ఉండటంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆదివారం నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వీడియోని బీజేపీ, నరేంద్ర మోడీ, పీఎంఓ తమ తమ అధికారిక యూట్యూబ్ ఛానెళ్లలో అప్ లోడ్ చేశారు. అయితే ఈ మూడు యూట్యూబ్ ఛానెళ్ళలో ప్రధాని ‘మన్ కీ బాత్’ వీడియోకి అనూహ్యంగా చాలా పెద్దసంఖ్యలో డిజ్ లైక్స్ రావడం గమనార్హం.
కామెంట్స్ రూపంలో కూడా నెటిజన్స్ నెగటివ్ గా స్పందిస్తూ తమ కోపాన్ని చూపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ వీడియోని తొలుత అప్‌లోడ్ చేశారు. బీజేపీ అధికారిక వెబ్ సైట్ లో ఇప్పటి వరకు 3.8 మిలియన్స్ మంది చూడగా కేవలం 154 k (ఒక లక్షా 54వేలు) లైక్స్ మాత్రమే వచ్చాయి. ఇదే సమయంలో 833k (8లక్షల 33 వేలు) డిజ్ లైక్స్ రావడం షాకింగ్ గా మారింది.
సొంత యూట్యూబ్‌లో కూడా
తన సొంత యూట్యూబ్ ఛానల్ లో కూడా నరేంద్ర మోడీ తన ‘మన్ కి బాత్’ ప్రసంగాన్ని అప్ లోడ్ చేశారు. ఇక్కడ ఇప్పటి వరకు ఈ వీడియోని 1.4 మిలియన్స్ మంది చూడగా కేవలం 92k (92వేలు) లైక్స్ వచ్చాయి. డిజ్ లైక్స్ అయితే ఏకంగా 228k (2లక్షల 28వేలు) రావడం గమనార్హం.
పీఎంఓ ఛానల్ లో ఈ వీడియోని ఇప్పటి వరకు 1.2 మిలియన్స్ మంది చూడగా 58k (58వేలు) లైక్స్, 136k (1లక్ష 36వేలు) డిజ్‌లైక్స్ రావడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ స్థాయిలో డిజ్ లైక్స్ రావడం ఇదే తొలిసారి కావడంతో బీజేపీ శ్రేణులు షాక్ తిన్నారు. దారుణంగా డిజ్ లైక్స్ రావడంపై కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
కరోనా ఉదృతి దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ మహమ్మారి ప్రభావంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కరోనాతో సహజీవనం తప్పదంటూ కేంద్రం అన్ లాక్ 4.0కి అనుమతులు ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా, కేంద్రం నీట్, జేఈఈ పరీక్షలకు సమాయత్తమవుతోంది.
దేశం ఆశించినది మోడీ మాట్లాడలేదు…
కేంద్రం పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం నెటిజన్స్ కోపానికి కారణమైందని తెలుస్తోంది. ఇదే సమయంలో కరోనా తీవ్రతతో ఆర్థిక వెసులుబాటు ఇచ్చేలా ప్రధాని నిర్ణయాలు ప్రకటిస్తారేమోనని ప్రజలు ఎదురుచూశారు. అందుకు భిన్నంగా మోడీ స్వదేశీ ఆట బొమ్మలనే వాడాలని పిలుపు నిచ్చారు. ఆ బొమ్మలను దేశంలోనే తయారు చేయాలని పిలుపు నిచ్చారు. ప్రపంచానికే ఇండియా ఆట బొమ్మల హబ్‌గా మారాలని కోరారు. అదే విధంగా కుక్కలను పెంచుకోవాలంటే దేశీయ జాతి కుక్కలనే పెంచుకోవాలని మోడీ చెప్పడం నెటిజన్స్ కు నచ్చలేదు.
కీలక అంశాలను ప్రస్తావించకుండా ఇలాంటి విషయాలపై మోడీ స్పందించడం నెటిజన్స్ కు కోపాన్ని తెప్పించింది. వారు పెట్టిన కామెంట్స్ చూస్తే ఇదే విషయం అర్ధమవుతోంది. అంతే గాకుండా దేశమంతా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మోడీ నెమళ్ళకు ఆహరం పెట్టే పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా నెటిజన్స్ కు కోపాన్ని తెప్పించిందని అర్ధమవుతోంది. ప్రధాని నుంచి ఇలాంటి విధానాలను తాము ఆశించలేదని వారు కామెంట్ చేస్తున్నారు.
మాటలగారడీకి కాలం చెల్లిందా?
మోడీ మన్ కీ బాత్ అంటే.. చాలా క్రేజీ కార్యక్రమం. ప్రజలు ఎగబడి విన్నారు. ప్రజలందరూ వినేలా చేశారు కూడా. అయితే ఈ స్థాయిలో మోడీ ప్రసంగాన్ని ప్రజలు తిరస్కరించడం తొలిసారి. తన మాటలు ప్రజల్ని సమ్మోహితుల్ని చేసే రోజులు గతించిపోయాయని నరేంద్రమోడీ గుర్తించవలసిన సమయం వచ్చింది. చేతల్లోకి దిగకపోతే.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత.. ఆఫ్‌లైన్లో కూడా వెల్లువెత్తితే.. ఈసారి బ్యాలెట్ బాక్సు బద్దలైపోవచ్చు. కనీసం ఆ స్పృహ ఉంటే అయినా.. ఆయన తన మాటల్ని దిద్దుకోవడం, చేతలకు పదును పెట్టుకోవడం జరుగుతుంది.











