ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ – జనసేన బంధం మరింత బలపడింది. రెండు పార్టీల అగ్రనేతలు, కీలక నేతలు కలిసిపోయి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. పొత్తు కుదరడంతో అధినేతల స్నేహం బాగా బలపడింది. ఈ రెండు పార్టీల జోరును అధికార పార్టీ తట్టుకునేలా కనిపించడం లేదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీని కుర్చీ దింపడం ఖాయం అనే అభిప్రాయాలు కూడా చాలా వ్యక్తం అవుతున్నాయి.
అందుకు తగ్గట్లుగానే వైఎస్ఆర్ సీపీ అన్నంత పనీ చేస్తోంది. టీడీపీ – జనసేన కార్యకర్తల మధ్య జరిగిన ఏవో చిన్న గొడవలను భూతద్దంలో పెట్టి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తుంది. ఇందులో టీడీపీ – జనసేన జోరుకు భయపడిపోయి అనేక కుట్రలు పన్నుతూ ఉంది. ఆ రెండు పార్టీలు విడిపోతే తనకు లాభం అని నమ్ముతూ ఆ దిశగా అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వైఎస్ఆర్ సీపీ చేజార్చుకోవడం లేదు. టీడీపీ – జనసేన బంధానికి బీటలు వారితే వారి ఓటు బ్యాంకు ట్రాన్స్ ఫర్ అవుతుంది కాబట్టి, వైఎస్ఆర్ సీపీ ఈ కుట్రను పన్నింది.
మొన్న ఈ మధ్య టీడీపీ – జనసేన కార్యకర్తల మధ్య ఓ చిన్న గొడవ జరిగిన దాన్ని పెద్దది చేసి రాష్ట్రమంతా వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తోంది. కాకినాడలో రెండు పార్టీల కార్యకర్తలను సమన్వయం చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే జోతుల నెహ్రూ, జనసేన ఇంచార్జి సూర్య చంద్ర ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో చిన్న గొడవ జరిగితే.. వాళ్లు సీటు కోసం కొట్టుకుంటున్నారని, కార్యకర్తలు గాయాలపాలై ఆస్పత్రుల్లో కూడా చేరుతున్నారని రకరకాలుగా తోచినకాడికి అడ్డగోలుగా వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు.
వచ్చే ఎన్నికలకు కలిసి కట్టుకట్టుగా వెళ్లాలని టీడీపీ, జనసేన అధినేతలు నిర్ణయించిన వేళ.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. వాటిలో అందరూ కలిసికట్టుగా పని చేయాలని, అప్పుడే అధికార పార్టీని ఢీకొట్టగలమని ఆత్మ విశ్వాసాన్ని ఇరు పార్టీల అగ్ర నేతలు పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు.